15 May, 2026 | 1:38 AM

యూపీలో గాలివాన బీభత్సం

15-05-2026 12:45 AM
  1. 110 మందికిపైగా దుర్మరణం
  2. 72 మందికిపైగా గాయాలు
  3. 170 మూగజీవాలు మృత్యువాత
  4. 227 ఇళ్లు ధ్వంసం
  5. కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు
  6. బాధితులకు సహాయం అందిస్తాం : సీఎం యోగి
  7. గాలిదుమారం ధాటికి 50 అడుగులపైకి ఎగిరిపోయిన వ్యక్తి

లక్నో, మే 14: ఉత్తరప్రదేశ్‌లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. గాలి, వాన దుమారంతో రాష్ట్రంలో ఒక్కరోజే 100కుపైగా మంది మృతి చెందినట్లు గురువారం యూపీ రిలీఫ్ కమిషనర్ కార్యాలయం ప్రకటించింది. ఒక్కసారిగా వాతావరణం మా ర్పు చెందడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది.

క్యూములోనింబస్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల వాన, పిడుగుల కారణంగా 110మందికి పైగా మృతిచెందారు. మరో 72 మందికి పైగా గాయపడ్డారు. 170 జంతువులు మృత్యువాతపడ్డాయి. 227 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఆకస్మిక విపత్తుపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆస్తినష్టం భారీగా జరగడంతో పూర్తివివరాలతో కూడి న గణాంకాలను అందించాలని ఆదేశించారు.

24 గంటల్లోగా బాధితులకు సహా యం అందేలా చూడాలన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో, భదోహిలో, ఫతేపూర్‌లో, సంత్ రవి దాస్ నగర్ లో, మీర్జాపూర్‌లో దాదాపు 110 మందికి పైగా మంది మృతి చెందారు. గాలిదుమారం ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అధికారులు పెద్ద ఎత్తున సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

ఆకస్మిక విపత్తుకు పలు ప్రాంతాల్లో రేకుల షెడ్లు, బ్యానర్లు, తేలికపాటి వస్తువులు గాలిలో ఎగిరిపోయాయి. ఓ వ్యక్తి ఓ రేకుల షెడ్డును పట్టుకొని నిల్చోగా గాలిధాటికి అది ఆకాశంలోకి ఎగిరిపోయిం ది. దీంతో ఆ వ్యక్తి కూడా సుమారు 50 అడుగుల ఎత్తులో 100 అడుగుల దూరం వరకు గాలిలో ఎగిరి కిందపడ్డాడు. చేతులు, కాళ్లు విరిగాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీడియో.. వార్తా, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడమే కాదు.. అందరూ విస్తుపోయారు.