15 May, 2026 | 1:36 AM

చక్కెర ఎగుమతులపై నిషేధం

15-05-2026 12:42 AM

చెరుకు దిగుబడులు బలహీన పడుతుండటంతో కొరత ఏర్పడకుండా కేంద్రం చర్యలు

సెప్టెంబర్ 30 వరకు అమలు

న్యూ ఢిల్లీ, మే 14: విదేశాలకు పంచదార ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే ఇప్పటికే లోడింగ్, కస్టమ్స్ కు అప్పగించిన చక్కెర నిల్వలకు మినహాయింపు ఇచ్చింది. ఈ నిషేధం సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుందని వెల్లడించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక మరికొన్ని రాష్ట్రాల్లో చెరకు దిగుబడులు బలహీనపడుతుండడం, వాతావరణ పరిస్థితుల రీత్యా రానున్న సీజన్‌లో చెరకు ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉండడంతో ముందుచూపుతో కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ముడి, తెల్ల, శుద్ధి చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొన సాగుతుందని తెలిపింది. అయితే ఈ ఉత్తర్వులకు ముందే లోడింగ్ ప్రారంభమైన, చక్కెర నిల్వలను కస్టమ్స్‌కు అప్పగించిన వాటి ఎగుమతులకు అనుమతిస్తామని వెల్లడించింది. ఇప్పటికే కుదిరిన ఒప్పందాల ప్రకారం ఐరోపా, అమెరికాకు ఈ ఎగుమతులకుఈ నిషేధం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్ ప్రపంచ వ్యాప్తంగా 80కిపైగా దేశాలకు చక్కెరను ఎగుమతి చేస్తుంది. చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్ తరువాత భారత్ రెండోస్థానంలో ఉంది. భారత్ ప్రపంచ దేశాలకు 19 శాతం చక్కెర ఎగుమతి చేస్తున్నది.