కేసముద్రంలో కంపు..కంపు.!
ఎక్కడి మురుగు అక్కడే
పెరిగిన దోమల బెడద
మహబూబాబాద్, జులై 16 (విజయక్రాంతి): కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా కేసముద్రం పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ తీరు మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, దనసరి, సబ్ స్టేషన్ తండా, అమీనాపురం గ్రామాలను విలీనం చేసి కొత్తగా మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కేసముద్రం వాస్తవ్యుడు కావడంతో పట్టణ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పట్టణంలోని పలు ప్రధాన రహదారులను విస్తరించడం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచే పనులకు నిధులు విడుదల చేసి గత ఏడాది పనులు ప్రారంభించారు.
అయితే రోడ్ల విస్తరణకు మార్కింగ్ ఇచ్చిన తర్వాత అడ్డంకులు తొలగించిన పిదప డ్రైనేజీ నిర్మించాల్సిన అధికారులు, కాంట్రాక్టర్లు అందుకు భిన్నంగా ముందుగానే గతంలో రోడ్లకు ఇరువైపులా ఉన్న ఉన్న డ్రైనేజీలను తొలగించేశారు. పాత డ్రైనేజీలను తొలగించిన తర్వాత కొత్తవి నిర్మించకపోవడంతో ప్రస్తుతం పట్టణంలో ఎక్కడి ముందు నీరు అక్కడే నిలిచిపోయింది. ఎవరి ఇంటి ముందు మురుగునీరు వారి ఇంటి ముందే తిష్ట వేసి పట్టణం పూర్తిగా దుర్గంధ భరితంగా మారింది.
మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో దోమల బెడద ఇటీవల తీవ్రంగా మారింది. కేసముద్రం విలేజ్ నుంచి మొదలుకొని అంబేద్కర్ సెంటర్ వరకు, ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మొదలుకొని పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు, పొట్టి శ్రీరాములు సర్కిల్ నుండి ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వరకు, పొట్టి శ్రీరాములు సర్కిల్ నుండి మహాత్మ జ్యోతిబాపూలే సర్కిల్ వరకు ప్రస్తుతం సైడ్ కాలువలు లేకుండా చేశారు.
పాతవి తొలగించి కొత్తవి నిర్మించకపోవడం వల్ల ప్రస్తుతం మురుగునీరు ఎక్కడికక్కడే నిలుస్తోంది. డ్రైనేజీ నిర్మాణాల కోసం చాలామంది అడ్డుగా ఉన్న తమ గృహాలను, షాపులను కొంతమేర తొలగించి ‘సెట్ బ్యాక్’ అయ్యారు. అయితే మరికొంతమంది ఇప్పటివరకు ‘సెట్ బ్యాక్’ కాకపోవడంతో డ్రైనేజీ నిర్మాణానికి ఆటంకంగా మారింది. పూర్తిస్థాయిలో సెట్ బ్యాక్ కాకముందే అధికారులు పాత డ్రైనేజీని తొలగించడం వల్ల ఎక్కడి మురుగునీరు అక్కడే నిలిచిపోయి ఇప్పుడు కేసముద్రం పట్టణం ‘కంపు కంపు’గా మారింది.
వైస్ చైర్ పర్సన్ ఇంటి వద్దే ఇలా!?
డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారినప్పటికీ అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసముద్రం మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ ఇంటి వద్ద ఉన్న డ్రైనేజీని తొలగించి కొత్తది నిర్మించకుండా వదిలేయడంతో, మురుగునీరు అంతా అక్కడే తిష్ట వేసి దుర్గంధ భరితంగా మారింది. ప్రజా ప్రతినిధుల నివాస గృహాల వద్దే పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.






