17 July, 2026 | 2:45 AM

మహిళలు స్త్రీనిధి రుణాలతో ఆర్థిక స్వావలంబన సాధించాలి

17-07-2026 02:29 AM

కలెక్టర్ రాహుల్ శర్మ 

భూపాలపల్లి, జూలై 16 (విజయక్రాంతి): మహిళా సంఘాల సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్త్రీ నిధి రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్త్రీ నిధి సమీక్ష కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళలకు రుణాల ప్రయోజనాలు, స్త్రీ నిధి యాప్ వినియోగంపై పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాల కోసం రుణాలు అందిస్తోందని, ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.   ప్రస్తుతం రికవరీలో జిల్లా 19వ స్థానంలో ఉందని, ఈ స్థాయిని మెరుగుపర్చాలని ఆదేశించారు. గణపురం టేకుమట్ల మండలాల్లో నిధుల దుర్వినియోగంపై బాధ్యులపై చర్యలు తీసుకుని రికవరీ చేయాలని స్పష్టం చేశారు.

కాటారం మండలంలో మహిళలు కుట్టు యంత్రాల సహాయంతో పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు తయారు చేస్తూ ఆదాయం పొందుతున్నారని ప్రశంసించారు. అలాగే మహిళా శక్తి క్యాంటిన్ల నిర్వహణపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బాలకృష్ణ, సహకార అధికారి వాల్య నాయక్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, మెప్మా పిడి రాజేశ్వరి, జిల్లా మహిళా సమాక్య అధ్యక్షురాలు సరిత తదితర అధికారులు పాల్గొన్నారు.