నిమ్స్‌లో వెన్నెముక ట్యూమర్ శస్త్రచికిత్స
ఎండోస్కోపిక్ విధానంలో అరుదైన ఘనత
పంజాగుట్ట, మే 9(విజయక్రాంతి): నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. ఈ విషయమై నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా లింగాన్నపేట గ్రామానికి చెందిన పిట్ల నవీన్(28) అనే యువకుడు తీవ్రమైన కాలినొప్పి, కాళ్ల బలహీనతతో నిమ్స్‌లో చేరారన్నారు. పరీక్షల అనంతరం అతని వెన్నెముకలో ట్యూమర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించామన్నారు.
అత్యాధునిక బయోర్టల్ ఎండోస్కోపిక్ టెక్నిక్ ద్వారా ఈ సంక్లిష్టమైన శస్త్రచికిత్సను నిమ్స్ వైద్య బృందం విజయవంతంగా నిర్వహించిందన్నా రు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో సుమారు రూ. 5 లక్షలు ఖర్చయ్యే ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌తో నిమ్స్‌లో పూర్తిగా ఉచితంగా అందించామని వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన రోగులకు ఇలాంటి అత్యాధునిక చికి త్సలను ఉచితంగా అందించడం గర్వకారణమన్నారు.
సాధారణ డిస్క్ సమస్యల నుండి క్లిష్టమైన సర్వైకల్, డార్సల్ స్పున్ ఆపరేషన్ల వరకు ఇప్పుడు నిమ్స్‌లో మినిమల్లీ ఇన్వేసివ్ ఎండోస్కోపిక్ విధానంలో అందుబాటులో ఉన్నా యన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో నిరంతరం ప్రో త్సాహం అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ప్రత్యేకకృతజ్ఞతలు తెలిపారు. శస్త్రచికిత్సను వైద్యులు ఎర్ర గుంట తిరుమల్, మురళీకృష్ణ, ఉమామహేశ్వర్ బృందం పర్యవేక్షించా రన్నారు. వారిని నిమ్స్ డైరెక్టరుతో పాటు న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ వంశీకృష్ణ ఎర్రమ్నేని, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ సుచంద అభినందించారు.






