బండ చెరువు ముంపు సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మేడ్చల్, జూన్ 11 (విజయక్రాంతి): మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్ అశోక్ రెడ్డి కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలను వివరించారు. బండ చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, చెరువు పరిసర ప్రాంతాల్లోని లోతట్టు కాలనీలకు ప్రతి వర్షాకాలంలో ఎదురవుతున్న ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా వరద నీటిని మళ్లించే ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని ఎమ్మెల్యే కోరారు.
అలాగే బండ చెరువులో ఏర్పడిన గుర్రపు డెక్క ను పూర్తిస్థాయిలో తొలగించి, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. చెరువు పరిశుభ్రత, పరిసర ప్రాంతాల అభివృద్ధి, ప్రజల ఆరోగ్య రక్షణకు సంబంధించిన అంశాలపై కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సమస్యల పరిష్కారానికి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరగా, చీఫ్ ఇంజనీర్ అశోక్ రెడ్డి సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు చేపట్టేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, ముంపు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడం, చెరువుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం తన లక్ష్యమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.






