సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అమలుకు కట్టుదిట్టమైన చర్యలు
అధికారులు సమన్వయంతో పనిచేయాలి : కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి, జూన్ 11: జిల్లాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నియమాలు2026ను సమర్థవంతంగా అమలు చేసి పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, జడ్పీ సీఈవో, డివిజనల్ పంచాయతీ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు,
వైద్య ఆరోగ్య, పశుసంవర్ధక, డీఆర్డీఓ తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఘన వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయ పద్ధతిలో అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఉత్పత్తి అయ్యే తడి, పొడి వ్యర్థాలను వేరు చేసి సేకరించే విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఇంటింటి చెత్త సేకరణ, వ్యర్థాల రవాణా, ప్రాసెసింగ్ ప్రక్రియలను నిరంతరం పర్యవేక్షించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారవేయడం, చెత్తను కాల్చివేయడం వంటి చర్యలను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు.
భారీ స్థాయిలో వ్యర్థాలు ఉత్పత్తి చేసే అపార్ట్మెంట్లు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు, ఫంక్షన్ హాళ్లను బల్క్ వేస్ట్ జనరేటర్లుగా గుర్తించి, వారు నిబంధనలకు అనుగుణంగా వ్యర్థాల నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
అనంతరం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన బట్ట సంచులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ పాండు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య, డీఆర్డీఓ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.






