అటవీ భూముల సంరక్షణపై ప్రత్యేక దృష్టి
* ఈకో సెన్సిటివ్, సైలెంట్ జోన్ల రక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
* నల్లమల్ల గ్రామాల పునరావాసం వేగవంతం
* జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
అచ్చంపేట: అడవుల సంరక్షణలో స్థానికుల భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ ఆకాంక్షించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో నాగర్ కర్నూల్ జిల్లాలోని అటవీ ప్రాంత భూముల సంరక్షణ, ఈకో సెన్సిటివ్ జోన్స్, చెంచులకు కల్పించే పునరావాస గ్రామాల అభివృద్ధి పనులపై, సంబంధిత శాఖల అధికారులు, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్రతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో అటవీ భూముల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, అక్రమ ఆక్రమణలను నివారించే విధానాలు, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడే కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అటవీ భూముల సర్వే, సరిహద్దుల గుర్తింపు, భూముల రికార్డుల నవీకరణ వంటి అంశాలపై రెవిన్యూ అటవీ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని,
అటవీ వనరులను సంరక్షించడంలో స్థానికుల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అక్రమంగా చెట్లను నరికే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఈకో సెన్సిటివ్ జోన్స్ పరిధిలో పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అటవీ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, తవ్వకాలు, రెవెన్యూ, పోలీసు, అటవీ సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు.
* జీవవైవిద్యం కాపాడెందుకు ప్రత్యేక చర్యలు
అటవీ ప్రాంతాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. పర్యావరణానికి హాని కలిగించే కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈకో సెన్సిటివ్ జోన్స్ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు పర్యావరణ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, అవసరమైన అనుమతులు లేకుండా ఎలాంటి పనులు ప్రారంభించకూడదని, ఎకో సెన్సిటివ్ జోన్ మరియు సైలెంట్ జోన్ల ఏర్పాట్లపై నివేదికల సమర్పణపై జిల్లా కలెక్టర్ పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖల ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి తరలించే 4 గ్రామాల ప్రజల కోసం పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామంలో ఏర్పాటు చేయనున్న పునరావాస గ్రామాల అభివృద్ధికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముందుగా ఆర్డిఓ, అటవీ అధికారులు, స్థానిక ఎమ్మార్వో ప్రాంతాన్ని సందర్శించి అభివృద్ధి పనులకు కావలసిన ఏర్పాట్లు పూర్తి చేయాలని, పునరావాస గ్రామాల్లో పాఠశాల, అంగన్వాడి, సీసీ రోడ్లు డ్రైనేజీ , విద్యుత్ అవసరాల వ్యవస్థ నిర్మాణాలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజలకు అక్కడ మెరుగైన వసతులు కల్పించి వారు ఇండ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ, రెవిన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్డిఏ పిడి చిన్న ఓబులేసు, పంచాయతీరాజ్ ఈఈ విజయ్ కుమార్, మిషన్ భగీరథ అధికారులు, కొల్లాపూర్, అచ్చంపేట ఆర్డీవోలు ఎమ్మార్వోలు అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






