5 May, 2026 | 9:02 PM

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా బచ్చలకూరి కృష్ణ

05-05-2026 07:37 PM

జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం

​గరిడేపల్లి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూ,జిల్లా కార్యదర్శిగా గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామానికి చెందిన బచ్చలకూరి కృష్ణను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య నియమించారు. దశాబ్ద కాలంగా పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న కృష్ణకు ఈ పదవి దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.పార్టీపై ఉన్న నిబద్ధత, నాయకత్వ లక్షణాలే ఆయన్ని ఈ స్థాయికి చేర్చాయని పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

​గరిడేపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా యువతను పార్టీ వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించారు.హుజూర్ నగర్ నియోజకవర్గ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందున్నారు. బూత్ ఎన్రోలర్ గా క్షేత్రస్థాయిలో పార్టీ ఓటు బ్యాంకును పటిష్టం చేయడంలో కృష్ణ చేసిన కృషిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తించి,తన ‘ప్రియ శిష్యుడు’గా ఆదరించారు.​​తన నియామకంపై బచ్చలకూరి కృష్ణ స్పందిస్తూ తనపై నమ్మకం ఉంచిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తనకు మార్గనిర్దేశం చేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపాటి నరసయ్యకి, పార్టీ సీనియర్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ​"రాబోయే రోజుల్లో సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరవేసేలా కృషి చేస్తానని" ఆయన ధీమా వ్యక్తం చేశారు.​​కృష్ణ నియామక వార్త తెలియగానే గరిడేపల్లి, హుజూర్ నగర్ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.నియోజకవర్గ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఆయన అనుచరులు,అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.