లంచం అడిగినందుకు చెప్పుదెబ్బలు
- టికెట్ లేని ప్రయాణికుడిని రూ.20 వేలు డిమాండ్ చేసిన ఆర్టీసీ చెకింగ్ ఇన్‌స్పెక్టర్
- అధికారిపై దాడికి దిగిన ప్రయాణికులు
- చెప్పుతో చితకబాదిన కండక్టర్
రాయికోడ్(సంగారెడ్డి), మే 1 (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సులో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తిపై కేసు కాకుండా ఉం డేందుకు లంచం అడిగిన చెకింగ్ ఇన్‌స్పెక్టర్‌పై ప్రయాణికులు, కండక్టర్ చితకబా దారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ బస్‌స్టాండ్ వద్ద శుక్రవారం జరిగింది.
హైదరాబాద్ నుంచి రాయికోడ్ మీదుగా నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు రాయికోడ్ వద్దకు రాగా ఆర్టీసీ టికెట్ చెకింగ్ ఇన్‌స్పెక్టర్ ప్రకాశ్ తనిఖీ చేపట్టారు. ఓ ప్రయాణికుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్టు ఆయన గుర్తించారు. అయితే జరిమానా విధించడంతో పాటు కండక్టర్‌కు చార్జి మెమో ఇవ్వాల్సిన ఆ అధికారి.. వారిపై కేసు లేకుండా చేయాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెకింగ్ అధికారి తీరుతో మండిపడ్డ ప్రయాణికులు తిరగబడ్డారు.
లంచం అడగడమే కాకుండా బెదిరింపులకు గురి చేయడంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు చెకింగ్ అధికారిపై దాడికి పాల్పడ్డారు. చెకింగ్ అధికారిని బస్సు నుంచి కిందికి దింపి చెప్పులతో దేహశుద్ధి చేశారు. కండక్టర్ సైతం చెప్పుతో దాడి చేశారు. ఈ అనూహ్య ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొందరు ప్రయాణికులు అధికారిని అక్కడి నుంచి పంపించి వేశారు.






