2 May, 2026 | 2:30 AM

పరిహారంపై పట్టింపేది..?

02-05-2026 01:17 AM

జాన్ పహాడ్ నుండి జగ్గయ్యపేటకు రెండో రైల్వే లైన్ భూ సేకరణలో గోల్ మాల్!                                  

చెల్లింపుల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ అధికారుల తీరుపై ఆరోపణలు                          

న్యాయం చేయాలంటున్న పలువురు రైతులు

మఠంపల్లి, మే 1: జాన్ పహాడ్ నుండి జగ్గయ్యపేట వరకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న రెండో రైల్వే లైన్ భూసేకరణ లో రైతులకు అందజేస్తున్న పరిహారంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భూములు కోల్పోతున్న రైతులలో కొందరితో కుమ్మక్కైన అధికారులు వారికి మాత్రం అధిక మొత్తంలో పరిహారాలు చెల్లిస్తూ.. పెద్ద ఎత్తున నష్టపోతున్న రైతులకు మాత్రం ఎంత మొత్తుకున్నా నామమాత్రపు చెల్లింపులు మాత్రమే చేస్తున్నారని పలువురు రైతుల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పరిహారంపై పట్టింపే లేకుండా పోయిందనే చర్చలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

కొందరికి మోదం.. కొందరికి ఖేధం..!

మఠంపల్లి మండలంలోని మంచ్యాతండా నుంచి వర్ధపురం, పెదవీడు, మఠంపల్లి, చౌటపల్లి రెవిన్యూ పరిధి గుండా మేళ్ళచేర్వు మండలం రామాపురం వరకు దాదాపు 33 కిలోమీటర్ వరకు రైల్వే రెండో లైన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రైల్వే అధికారులు మఠంపల్లి మండల సంబంధిత అధికారులు రైల్వే లైన్ కు కేటాయించిన భూముల్లో వ్యవసాయానికి సంబంధించిన బోరు మోటర్లు, పైప్ లైన్లు, పొలాల్లో కట్టుకున్న అమ్మవార్ల దేవాలయాలు సర్వే కూడా చేస్తూన్నారు.

అయితే ఈ సర్వే విషయంలో కొంత మంది రైతులతో అధికారులు కుమ్మక్కై బోరు మోటర్లు,పైప్ లైన్లు, దేవాలయాలు ఉన్నా,  లేకున్నా ఎస్టిమేషన్ ఎక్కువగా ఏసి వారికి అధిక మొత్తంలో చెల్లింపులు వచ్చేలా చేస్తున్నారని ఆరోపణలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా బోరు మోటర్లు లోతు తక్కువగా ఉన్న, పైప్ లైన్లు తక్కువగా ఉన్న ,  భూమి తక్కువగా పోతున్నా రిపోర్ట్ లలో ఎక్కువగా చూపిస్తూ గోల్ మాల్ చేస్తూన్నారని పలువురు రైతులు చెబుతున్నారు.

కానీ కొందరికి మాత్రం వాస్తవాలను పక్కకు నెడుతూ కొద్ది మొత్తంలోనే చెల్లింపులు జరిగేలా చూస్తున్నారని కొందరు బాధిత రైతులు తమ గోడును వినిపిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ వ్యవహారం కొందరికి మోదం.. మరి కొందరికి ఖేదంగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు. సర్వే నిర్వహించే అధికారులు వార్ధాన్ని వీడి నష్టపోతున్న రైతులకు తగిన పరిహారం అందించి  అందరికీ తగు న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. . 

సర్వే చేసి బాధితులకు న్యాయం చేస్తాం 

రైల్వే రెండో లైన్ సర్వే విషయంలో కొంత మంది రైతులు ఫిర్యాదు చేశారు.ఈ విషయం పై మరొక సారి సర్వే చేసి బాధిత రైతులకు న్యాయం చేస్తాం,అలాగే ఓపెన్ బ్లాస్టింగ్ నిర్వహిస్తే అధికారుల అనుమతి తీసుకోవాలి లేని ఎడల చర్యలు తీసుకుంటాం.

వి.శ్రీనివాస్, ఆర్డీవో, హుజూర్ నగర్

అధికారుల పర్మిషన్ లేకుండా బ్లాస్టింగ్ 

రైల్వే కాంట్రాక్టర్ లు కొన్ని చోట్ల సంబంధిత అధికారుల పర్మిషన్ లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారు. దానివల్ల బోరు మోటర్లు కుంగిపోవడం, పొలాల్లో రాళ్లు పడటం,పశువుల కాపరులు, రైతులకు ముందస్తు సమాచారం లేకపోవడంతో భయాందోళనలకు గురవుతున్నాము.

బానోతు సేవ్యినాయక్, బాధిత రైతు