15 July, 2026 | 1:03 AM

కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడుగుతాం

15-07-2026 01:03 AM

పాలమూరు నిర్లక్ష్యం చేసిన బీఆర్‌ఎస్

బావబామ్మర్దులకు గతం లేదు, భవిష్యత్తూ లేదు

కరెంట్ అంటేనే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే కరెంట్

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

గద్వాల, జూలై 14 (విజయక్రాంతి)/గద్వాల/అలంపూర్/మల్దకల్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా జలాలతో పాలమూరు రైతుల కాళ్లు కడుగుతుందని చెప్పారు.

మంగళవారం గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మండలం జూలేకల్, పాచర్ల (రాజోలి మండలం), మేడికొండ (ఇటిక్యాల మండలం), అరగిద్ద, తుమ్మలచెరువు, కుర్తిరవలచెరువు, సోమాపురం, పెద్దపాడు, ఉలిగేపల్లి గ్రామాలకు సంబంధించి, విద్యుత్ ఉపకేంద్రాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి ప్రారంభించారు. సబ్‌ష్టేన్‌కు శంకుస్థాపన చేసి రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లను పంపిణీ చేశారు. గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం కుర్తిరావులచెరువు గ్రామంలో మంగళవారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం భూమిపూజలు, శంకుస్థాపనలకే పరిమితమై ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించలేదని విమర్శించారు.

భూసేకరణకు అవసరమైన నిధులు కూడా విడుదల చేయకుండా ప్రాజెక్టును మధ్యలోనే వదిలేసి పాలమూరు రైతాంగానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్లను వేగంగా పూర్తి చేసి పాలమూరు జిల్లాను కృష్ణా జలాలతో సస్యశ్యామలం చేస్తామని భట్టి హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. బావబామ్మర్దులకు గతం లేదు.. భవిష్యత్తూ లేదని, ప్రజలను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు? అని ప్రశ్నించారు. 

తెలంగాణ ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని, దొరల పాలనను ఇక కోరుకోవడం లేదని, బీఆర్‌ఎస్ రాజకీయాలకు తెలంగాణలో ఇక స్థానం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తోందని, ‘కరెంట్ అంటేనే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే కరెంట్‘ అని భట్టి అన్నారు. త్వరలో ఇందిరమ్మ జయంతి సందర్భంగా రూ.5 లక్షల ‘ఇందిరమ్మ భీమా‘ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.

బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారని, కానీ కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని స్పష్టం చేశారు. 2023లో 15 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, ప్రస్తుతం 3 వేల మెగావాట్లు అదనంగా వినియోగిస్తున్నప్పటికీ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ భీమా, మహిళల ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు వంటి సంక్షేమ పథకాలను నిలిపివేస్తారని ఆయన ఆరోపించారు.

కాగా మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు భూసేకరణను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. భూసేకరణలో ఏ రైతుకూ అన్యాయం జరగదని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం తగిన పరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. గంజాయి మత్తు పదార్థాల వంటి బారిన యువత పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదని అన్నారు.

మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. గత 10 ఏండ్ల బిఆర్ఎస్ పాలనలో ఎలక్షన్ ముందు చాకెట్లు చూయించి ఓట్లు దండుకున్నారు తప్ప అభివృద్ధి ఏమి చేయలేదని అన్నారు. జూరాల, శ్రీశైలం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందని ఇంకా 100 ఏండ్లు అయిన కూలి పోదని బి ఆర్ ఎస్ నిర్మించిన కాళేశ్వరం లాగా కూలిపోదన్నారు. ఆయా కార్యక్రమాల్లో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి, శంకర్, స్పోర్ట్స్ అథారిటి చైర్మన్ శివ సేనారెడ్డి, ఫిష్ అండ్ గోట్ చైర్మన్ సరిత, డీసీసీ చైర్మన్ రాజీవ్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.