ఆవంచ రైతు వేదికలో విత్తన మేళా
నర్సాపూర్: తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సాపూర్ మండలం ఆవంచ రైతు వేదికలో విత్తన మేళా నిర్వహించారు. ఈ మేళాలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనువైన కూరగాయలు, మొక్కజొన్న, జొన్న, కందులు, పెసర్లు, పశుగ్రాస విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డీఏపీ రైతులకు అందుబాటులో ఉంచారు. రైతులు తమకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను ఒకేచోట కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (టీఆర్‌వీకే) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ మాట్లాడుతూ... ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరుతడి పంటలైన జొన్న, కందులు, మినుములు, పెసర్లు, కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆరుతడి పంటల ప్రాముఖ్యత, సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే నానో యూరియా, నానో డీఏపీ వినియోగ విధానం, వాటి ప్రయోజనాలను రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ స్రవంతి కరుణాకర్, వ్యవసాయ విస్తరణ అధికారులు లావణ్య, తేజస్విని, రాజశేఖర్, దుర్గాప్రసాద్, విత్తన డీలర్లు, రైతులు పాల్గొన్నారు.






