భిక్కనూర్ పీహెచ్‌సీలో వైద్య సేవలపై డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ
భిక్కనూర్,(విజయక్రాంతి): ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ పేర్కొన్నారు. బుధవారం భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఆయన ఆస్పత్రి పనితీరును సమీక్షించారు. ముందుగా ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించిన డైరెక్టర్ రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న చికిత్స, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మందుల నిల్వలు, రికార్డులు, వైద్య సేవల నిర్వహణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
వైద్య సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశమున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తూ జ్వరాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫీవర్ సర్వే, ఫ్రైడే–డ్రై డే కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించి వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. ఆస్పత్రిలో అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో జిల్లా వైద్యాధికారి వెంకట్, మండల వైద్యాధికారి హేమీమా, ఆరోగ్య విస్తీర్ణ అధికారి వెంకటరమణ, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.






