ఓటరు జాబితా సవరణలో బూతుల ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలి
బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు
బాన్సువాడ,(విజయ క్రాంతి): కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు పిలుపునిచ్చారు.బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో పార్టీ బీఎల్ఏ ఇన్చార్జిలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఓటరు పేరును జాబితాలో నమోదు చేయించడం, వివరాల్లోని తప్పులను సరిదిద్దడం, కొత్తగా అర్హత పొందిన వారిని ఓటర్లుగా నమోదు చేయించడం వంటి అంశాల్లో బీఎల్ఏలు చురుకుగా పనిచేయాలని సూచించారు.
ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకొని ఇప్పటివరకు ఇవ్వని ప్రతి ఓటరిని గుర్తించి వ్యక్తిగతంగా వారు ఫారాలను పూర్తిగా నింపి సంబంధిత బీఎల్‌ఓలకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కేవలం ఫారాలు పంపిణీ చేయడం మాత్రమే కాకుండా, ప్రతి ఫారం డిజిటలైజేషన్ జరిగిందా లేదా అనే విషయాన్ని కూడా బీఎల్ఏలు పరిశీలించాలని సూచించారు. మరో నాలుగు రోజుల్లో ప్రత్యేక సవరణ కార్యక్రమం ముగియనున్నందున గ్రామాల్లోని ప్రతి ఇంటికి తిరుగుతూ నూతనంగా అర్హులైన ఓటరును గుర్తించి నూతనగా ఓటు వచ్చే విధంగా చూడాలని ఆయన కోరారు.
ఓటరు జాబితాలో పేర్లు తొలగించబడకుండా, తప్పులు లేకుండా ఉండేలా బీఎల్ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు.100 శాతం ఓటరు జాబితా సవరణ పూర్తయ్యేలా ప్రతి బీఎల్ఏ బాధ్యతగా వ్యవహరించి ఎన్నికల సంఘం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని బాన్సువాడ నియోజకవర్గం బిఎల్ఎ ఇన్చార్జి లకు ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు చిదురు సాయిలు జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ నసుల్ రాబాద్ మండల అధ్యక్షులు హనుమాన్లు బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి పాశం భాస్కర్ రెడ్డి భూమేష్ మండల నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






