ఏజెన్సీలో భారీ వర్షాలు.. గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్
* బయట ప్రపంచానికి వచ్చేందుకు వాగుపక్కన వేచి చూస్తున్న ఉట్నూర్ మండలం నర్సాపూర్ ( జే )పంచాయతీ గిరిజనులు..
ఉట్నూర్,(విజయక్రాంతి): పుట్లూరు ఏజెన్సీ ప్రాంతంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఏజెన్సీలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, నార్నూర్, సిరికొండ, ఆదిలాబాద్ రూరల్ మండలాలతోపాటు కొమురం భీం జిల్లాలోని జై నూర్, సిర్పూర్ ( యు ), లింగాపూర్, కేరా మేరీ, తీర్యాని తదితర మండలాల పరిధిలోని మారుమూల గ్రామాల కు అడ్డంగా ఉన్న వాగులు పొంగి పోతున్నాయి. వాగులు పొంగిపోవడంతో గిరిజనులు భయ్యా ప్రపంచానికి దూరంగా ఉండి పోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఏజెన్సీ ప్రాంతంలోని పంచాయతీ కేంద్రాలకు సైతం సరియైన రహదారులు లేక వాగులపై వంతెన నిర్మాణం చేపట్టక గిరిజనులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని అల్లికోరి గ్రామపంచాయతీ తో పాటు ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్ ( జె ) పంచాయతీ కేంద్రానికి ప్రజలతో పాటు అధికారులు వెళ్లాలంటే వాగులు ప్రవహిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో గిరిజన గ్రామాల్లో వ్యాధుల బారిన పడిన, గర్భిణీలు వైద్యంతో పాటు ప్రసవానికి ఆసుపత్రులకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని వాగులు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకొని వాగులపై వంతల నిర్మాణాలకు మంజూరైన నిధులతో పనులు తీసుకున్న కాంట్రాక్టర్లను పిలిపించి వారితో పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటే వచ్చే వర్షాకాలం అయిన ఇలాంటి ఇబ్బందులు ఉండవని గిరిజనులు కోరుతున్నారు. వాగులు దాటలేక విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. ఈ విషయాలని ప్రభుత్వం గుర్తించి వాగుల కష్టాలు తీర్చాలని ఏజెన్సీ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు.






