15 June, 2026 | 1:08 AM

బడి ఈడు పిల్లలు బడిలో ఉండాల్సిందే..

15-06-2026 12:04 AM

నేడు మోగనున్న బడిగంట 

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందజేత 

‘విజయక్రాంతి’తో మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి 

పాపన్నపేట, జూన్ 14: బడి ఈడు పిల్లలు బడిలో ఉండాల్సిందేనని.. ఏ రూపంలోనూ బాల కార్మిక వ్యవస్థను సహించేది లేదని మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. నేడే బడిగంట మోగనుంది. 51 రోజుల సెలవులకు తెరపడింది. జూన్ 15న సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి.

ఈనెల 20న బడిబాట కార్యక్రమం ముగుస్తున్న నేపథ్యంలో ’విజయక్రాంతి’  మండల విద్యాధికారితో ముఖాముఖి నిర్వహించింది. మండలంలో పటిష్ట నిఘాతో బాల కార్మిక వ్యవస్థ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తహసిల్దార్, ఎస్త్స్రతో బృందం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎక్కడైనా బాల కార్మికులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, సంబంధిత వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. బాలలను పనిలో పెట్టుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బడిబాట కార్యక్రమంలో ఏం చేస్తున్నారు?

బడి ఈడు పిల్లలు బడిలో చేర్చేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్వహకులకు ఆదేశాలు జారీ చేశాం. ఇందులో భాగంగా ప్రతిరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈనెల 20వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాలు ఉంటాయి. రోజుకో కార్యక్రమంతో గ్రామాల్లో సందడిగా ఉంటుంది. మరో వారం రోజుల్లో ఈ కార్యక్రమం ముగియనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతోపాటు ఉచిత భోజనం, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, ఇతర సదుపాయాలు ఉన్నాయని చెబుతున్నాం. మండలంలో 9 ఉన్నత, 8 ప్రాథమికోన్నత, 42 ప్రాథమిక, 1 కస్తూర్బా, 7 ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఉన్నాయి. 

పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తుల మాటేమిటి?

మండలంలో ఇప్పటికే 80 శాతం పాఠ్య పుస్తకాలు వచ్చాయి. ఏకరూప దుస్తులు ఇంకా రాలేదు. ప్రవేశాల ప్రక్రియ ఇంకా సాగుతుంది. అవసరాన్ని బట్టి గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం. మండలానికి 32,000 పాఠ్యపుస్తకాలు, 30,000 నోటుబుక్స్ వచ్చాయి.

పాఠశాలల్లో సౌకర్యాలు అంతంతే..

మండలంలో దాదాపు అన్ని పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కొన్ని పాఠశాలలకు మరుగుదొడ్లు సరిపడా లేవు. మరికొన్ని పాఠశాలలకు తరగతి గదులు సరిపడా లేవు. పూర్తిగా గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం. పాఠశాలలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం. ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అన్ని గ్రామాల ప్రజల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందించాలని కోరుకుంటున్నాం.

ప్రైవేటు పాఠశాలలపై నియంత్రణ ఎలా?

ప్రైవేటు పాఠశాలలపై నిఘా నియంత్రణ ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే. లేకుంటే కఠిన చర్యలు తప్పవు. ఫీజులు, పుస్తకాల విక్రయాలపై నిఘా పెట్టాం. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. సమస్యను ఉన్నతాధికారులకు నివేదించి తగువిధంగా చర్యలు చేపడతాం.