15 June, 2026 | 2:23 AM

వేములవాడలో ఇందిరమ్మ కమిటీ సమావేశం

15-06-2026 01:06 AM

కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ విమర్శలు

వేములవాడ, జూన్ 14,(విజయ క్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలో ఆదివారం నిర్వహించిన పట్టణ ఇందిరమ్మ కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. గత పదేళ్లలో కే. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం విఫలమైందని, అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని పేర్కొన్నారు.

అలాగే కేటీఆర్ కావాలనే ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు ప్రజలు ఇప్పటికే తగిన బుద్ధి చెప్పారని, ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందజేస్తామని, ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇళ్లు మంజూరు చేయడంలో కమిటీ సభ్యులు చురుకుగా పనిచేయాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా తెలంగాణ పథకాలపై ఆసక్తి చూపుతున్నాయని ఆది శ్రీనివాస్ తెలిపారు.