15 June, 2026 | 1:52 AM

మట్టి మాఫియా గుప్పిట్లో కందుకూరు!

15-06-2026 12:44 AM
  1. అనుమతులు లేని దందా.. రోడ్లపై నెత్తుటి చారలు
  2. ఓవర్‌లోడ్ టిప్పర్ల అతివేగం.. బలవుతున్న అమాయక ప్రాణాలు 
  3. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ, ఆర్టీఓ అధికారులు
  4. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి.. n ఫ్యూచర్ సిటీ పరిధిలో ఆగని అక్రమ తవ్వకాలు

రంగారెడ్డి /కందుకూరు, జూన్ 14 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో మట్టి మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా, పగలు రాత్రి అనే తేడా లేకుండా యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేవారే కరువయ్యారు. సంబంధిత రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులకు ఇది కాసుల కురిపించే మేతగా మారింది. ‘దండిన కాడికి దంచుకో.. తోడిన కాడికి తవ్వుకో‘ అన్న చందంగా కందుకూరుతో పాటు పక్కనే ఉన్న మహేశ్వరం, కడ్తాల్ మండలాల్లో సైతం ఈ అక్రమ తవ్వకాల పర్వం దశాబ్దాలుగా నిరంతరాయంగా కొనసాగుతోంది.

నిబంధనలు ’నాలా’ పాలు.

సాధారణంగా అనుమతులు ఉన్నా రెండు మూడు ఫీట్ల లోతున మాత్రమే మట్టిని తోడి భూమిని చదును చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ భూగర్భ గనుల శాఖ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, ఏకంగా ఆరు నుంచి పది ఫీట్ల లోతు వరకు భారీ జెసిబి  యంత్రాలతో భూమిని తవ్వేస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా తవ్విన మట్టిని టిప్పర్లలో ఓవర్లోడ్ లోడ్ చేసుకుని గ్రామాల్లోని ఇరుకైన రోడ్లపై అతివేగంతో నడుపుతున్నారు. దీనివల్ల గ్రామీణ రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారి ధ్వంసమవుతుండటమే కాకుండా, సాధారణ ప్రయాణికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి దాపురించింది.

టిప్పర్ కింద పడి మహిళ మృతి..

ఈ అక్రమ రవాణా కేవలం రోడ్ల నాణ్యతను మాత్రమే దెబ్బతీయడం లేదు, అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటోంది. గత రెండు రోజుల క్రితం జరిగిన ఘోర సంఘటన ఇందుకు సజీవ సాక్ష్యం. ఆకుల మైలారం గ్రామానికి వెళ్లి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని తిరిగి వస్తుండగా, బేగరికంచ గ్రామానికి చెందిన ఒక మహిళ అతివేగంగా వచ్చిన ఓవర్లోడ్ టిప్పర్ టైర్ కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపినప్పటికీ, అధికారుల్లో ఎలాంటి చలనం రాకపోవడం గమనార్హం.

ఫ్యూచర్ సిటీ ఆశయాలకు గండి.. ప్రభుత్వ భూములు మాయం

ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ’ఫ్యూచర్ సిటీ’గా మార్చాలని, సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయాలని ప్రతిష్టాత్మక ప్రణాళికలు రచిస్తుంటే.. మరోవైపు మట్టి మాఫియా ప్రభుత్వ ఆశయాలకు, ఆదాయానికి గండి కొడుతోంది. రాత్రి వేళల్లో అక్రమంగా మట్టిని తవ్వి, రియల్ ఎస్టేట్ ప్రైవేటు వెంచర్లకు, ఇటుక బట్టీల యాజమాన్యాలకు తరలిస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పోరంబోకు, సీలింగ్ భూములను సైతం వదలకుండా తవ్వేస్తూ ప్రభుత్వ ఆస్తులను మాయం చేస్తున్నారు.

ప్రజల ఆగ్రహం  అధికారులలో ఉదాసీనత..

‘గత 20 సంవత్సరాలుగా కందుకూరు మండలంలో ఈ తతంగం నడుస్తోంది. రాజకీయ పలుకుబడి, అధికారుల అండదండలు ఉండటంతోనే మాఫియా ఇంత ధీమాగా రెచ్చిపోతోంది. ఇంత జరుగుతున్నా రెవె న్యూ, పోలీస్, ఆర్టీఓ  అధికారులు కనీసం వాహనాలను తనిఖీ చేయకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి?‘ అని స్థానిక ప్రజలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.

గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న మట్టి మాఫియా పై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా ని ఘా పెట్టి, అక్రమ తవ్వకాలు జరుపుతున్న జె సిబిలను, ఓవర్లోడ్ వాహనాలను సీజ్ చే యాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అ క్రమార్కులతో పాటు వారికి సహకరిస్తున్న అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటేనే అమాయకుల ప్రాణాలకు రక్ష ణ లభిస్తుందని పలువురు కోరుతున్నారు.