కబ్జాదారుల చెరలో ఎర్రచెరువు..!
10 14 ఎకరాల చెరువు మాయం...
ఆనవాళ్లు కూడా లేకుండా చేసిన అక్రమార్కులు
మూడు దశాబ్దాలుగా అధికారుల నిర్లక్ష్యం
కోటపల్లి, జూన్ 14: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ఎర్రగడ్డ గ్రామంలో ఒకప్పుడు గ్రామ ప్రజలకు జీవనాధారంగా నిలిచిన ఎర్ర చెరువు నేడు పూర్తిగా కనుమరుగైపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సుమారు 10 నుంచి 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు ప్రస్తుతం ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఎర్ర చెరువును రక్షించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.., గత 30 ఏళ్లుగా ఎర్ర చెరువు క్రమ క్రమంగా ఆక్రమణలకు గురవుతూ వచ్చింది. పలుమార్లు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నిసార్లు అధికా రులకు మొర పెట్టుకున్న స్పందించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఫలితంగా ఒకప్పుడు గ్రామానికి నీటి వనరుగా, పశువులకు తాగునీటి ఆధారంగా, వ్యవసాయానికి ఉపయోగపడిన చెరువు నేడు పూర్తిగా మాయ మైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్ర చెరువు కేవలం నీటి నిల్వ కేంద్రం మా త్రమే కాదు, గ్రామ అభివృద్ధికి కీలకమైన సహజ సంపద. చెరువు చుట్టూ జీవ వైవిధ్యం, పచ్చదనం, భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడేదని గుర్తు చేస్తున్నారు.
అయితే ఆక్రమణలు పెరగడంతో చెరువు విస్తీర్ణం రోజురోజుకూ తగ్గిపోతూ చివరకు పూర్తిగా కనుమ రుగైందని వాపోతున్నారు.ఇప్పటికే ఎర్ర చెరువు ఆనవాళ్లు లేకుండా పోయిన నేపథ్యంలో గ్రామంలోని మరో ప్రధాన నీటి వనరైన ఊరు చెరువుపైనా కబ్జాదారుల కన్ను పడిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్య త్తులో ఊరు చెరువు కూడా మాయమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రజా అవసరాలకు ఉపయోగపడే చెరువులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అక్రమ ఆక్రమణలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులను సంప్రదించగా, ఎర్ర చెరువు భూములపై మోకా సర్వే నిర్వహించి పూర్తి స్థాయిలో పరిశీలిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. చెరువు భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిని ఉపేక్షించబోమని అధికారులు హెచ్చరించినట్లు సమాచారం. ఎర్ర చెరువు ఆక్రమణ వ్యవహారం ఇప్పుడు గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. మూడు దశాబ్దాలుగా సాగుతున్న ఈ అక్రమాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, గ్రామ ప్రజల ఆశలను ఎంతవరకు నెరవేరుస్తారో వేచి చూడాల్సి ఉంది.






