14 June, 2026 | 8:00 PM

దళిత బహుజన పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా అమూల రాజన్న నియామకం

14-06-2026 06:40 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): దళిత బహుజన పార్టీ (డీబీపీ) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాగూడ గ్రామానికి చెందిన అమూల రాజన్నను నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జూన్ 12, 2026 తేదీతో అధికారిక అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ను అందజేశారు. 2026 నుంచి 2030 వరకు ఈ పదవీకాలం కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలైన ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత లక్ష్యాల సాధన కోసం పనిచేయాలని సూచించారు.

ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు పేద ప్రజల రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని ఆదేశించారు.ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ బలోపేతం, మండల స్థాయి కమిటీల ఏర్పాటు, పార్టీ కార్యక్రమాలను గ్రామీణ స్థాయికి తీసుకెళ్లే బాధ్యతలను అమూల రాజన్నకు అప్పగించారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ జాతీయ నాయకత్వానికి అమూల రాజన్న కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.