బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి అండ
అర్హులైన ఒక్క ఓటర్ ఓటు తొలగకుండా చూడాలి
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మంచిర్యాల టౌన్, జూన్ 14 (విజయక్రాంతి): బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి అండ దండలని, అర్హులైన ఒక్క ఓటర్ ఓటు తొలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
ఆదివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి పద్మావతి గార్డెన్ లో మంచిర్యాల ఎం ఎల్ ఏ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై బూత్ లెవెల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)లకు నిర్వహించిన అవగాహన, శిక్షణ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై దిశా నిర్దేశం చేశారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కును అర్హులకు దక్కేలా చూడాలన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటర్ల జాబితా ఎంతో కీలకమని, ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరించాలన్నారు. ఎన్నికల అధికారులకు సహకరిస్తూ 18 ఏండ్లు నిండిన వారికి ఓటు నమోదు, వలసలు, మరణాలు, చిరునామా మార్పులు వంటి అంశాలపై పూర్తి సమాచారంతో సహకరించాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ ఒక్క ఓటర్ కు అన్యాయం జరుగకుండా చూడాలన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టీపిసిసి జనరల్ సెక్రెటరీ రహ్మత్ హుస్సేన్, మాస్టర్ ట్రైనర్ అవేజ్, తెలంగాణ టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంఛార్జి శ్రవణ్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, బి ఎల్ ఏ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






