సింగరేణి ఓసీనీ సందర్శించిన డిప్యూటీ సీఎం
నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓసీ (open cast) గనిని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదివారం సందర్శించారు. శ్రీరాంపూర్ ఉపరితల గని వ్యూ పాయింట్ వద్ద మొక్కను నాటారు. అనంతరం గని కార్యకలాపాలను పరిశీలించారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతకు సంబంధించిన వివరాలను శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ వివరించారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, మార్కెటింగ్ అంశాలపై సీఎండీ, డైరెక్టర్లను అంశాల వారీగా అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోటీ మార్కెట్ పరిస్థితుల్లో సంస్థ మరింత బలోపేతం కావాలంటే నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అదే సమయంలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ఉత్పత్తి కార్యకలాపాలను కొనసాగించాలని స్పష్టం చేశారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడం ద్వారా సింగరేణికి మరో వందేళ్లపాటు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
సంస్థ లాభదాయకత, పోటీతత్వ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు సమష్టిగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్సీ దండే విఠల్, సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె. వెంకటేశ్వర్లు (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్), గౌతమ్ పోట్రు (పర్సనల్ & ఫైనాన్స్), ఈడీ (కోల్ మూవ్‌మెంట్) బి వెంకన్న, ఐఆర్‌టీఎస్ జీఎం (కో-ఆర్డినేషన్ & మార్కెటింగ్) టి. శ్రీనివాస్, శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






