బడులు ఉన్నా.. పిల్లలు లేరు.. కోట్లు ఖర్చు... ఫలితం శూన్యం..
కల్లూరు, ఆగస్టు 2 (విజయ క్రాంతి): ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ, కల్లూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తోంది.మండలంలోని సుమారు 60 ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని సింగిల్ డిజిట్ విద్యార్థులతో కొనసాగుతుండగా, మరోవైపు కేవలం 8 ప్రైవేట్ పాఠశాలల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారు.ఈ పరిస్థితి ప్రభుత్వ విద్యపై ప్రజల విశ్వాసం తగ్గుతోందన్న సంకేతాలను ఇస్తోంది.ఉపాధ్యాయుల జీతభత్యాలకే నెలకు సుమారు రూ.2 కోట్లు ఖర్చవుతున్నా, నమోదు పెరగకపోవడం విమర్శలకు తావిస్తోంది.
మధ్యాహ్న భోజనం,ఉచిత పాఠ్యపుస్తకాలు,యూనిఫాంలు వంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు.ఇంగ్లీష్ మీడియంఆకర్షణ, బోధన నాణ్యతపై సందేహాలు, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అదనంగా, కొందరు ఉపాధ్యాయులే తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.విద్యార్థుల సంఖ్య నిరంతరం తగ్గుతున్నా బాధ్యులపై చర్యలు లేకపోవడం ప్రశ్నార్థకంగా మారింది.పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించి, బాధ్యతను నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు,తల్లిదండ్రులు కోరుతున్నారు.






