2 August, 2026 | 6:12 PM

శ్రీ సేవాలాల్ జగదాంబ ఆలయంలో చోరీ

02-08-2026 04:50 PM

అమ్మవారి వెండి కిరీటం, హారం, ముక్కుపుడక అపహరణ

శివ్వంపేట,ఆగస్ట్ 2 (విజయక్రాంతి): మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో వరుస దేవాలయ చోరీలు భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దేవాలయాలనే లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని దుండగులు వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు. మూడు రోజుల క్రితం గూడూరు గ్రామంలోని శ్రీ గురుపీఠంలో చోరీ ఘటన మరువకముందే మరోసారి దుండగులు రెచ్చిపోయి శంకర్ తండాలోని శ్రీ సేవాలాల్ జగదాంబ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.మండలంలోని భీమ్లా తండా గ్రామపంచాయతీ పరిధిలోని శంకర్ తండా శ్రీ సేవాలాల్ జగదాంబ ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని అమ్మవారి వెండి కిరీటం, హారం, ముక్కుపుడకతో పాటు రెండు హుండీల్లోని నగదును అపహరించారు.

ఈ ఘటనలో సుమారు 30 తులాల వెండి ఆభరణాలు, రెండు హుండీల్లో ఉన్న సుమారు రూ.60 వేల నగదు దొంగిలించినట్లు సమాచారం. చోరీ విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్ఐ మధుకర్ రెడ్డి, ఏ ఎస్ ఐ భారతి ఆధ్వర్యంలో క్లూస్ టీం ఆధారాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఆలయం పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల వరుసగా దేవాలయాల్లో చోరీలు జరగడం స్థానిక భక్తుల్లో భయాందోళనకు గురిచేస్తోంది. ఆలయాల భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు దుండగులను త్వరగా అరెస్టు చేయాలని గ్రామస్థులు, భక్తులు పోలీసులను కోరుతున్నారు.