3 August, 2026 | 2:23 AM

సర్టిఫికెట్లకు ఎదురుచూపులే?

03-08-2026 01:22 AM
  1. తహసిల్దార్ చుట్టూ ప్రదక్షిణలు
  2. పట్టించుకోని అధికారులు
  3. కరీంనగర్ అర్బన్ తహసీల్ పరిధిలో ప్రజల ఇక్కట్లు

కరీంనగర్, ఆగస్ట్2(విజయక్రాంతి):కరీంనగర్ అర్బన్, రూరల్ తాహసీల్దార్ కార్యాల యాలకు వచ్చే ప్రజల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సేవలను సులభతరం చేయాలనే లక్ష్యంతో ఆన్లైన్ దరఖాస్తులు, డిజిటల్ విధానాలను ప్రవేశపెట్టినా, క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని చెబుతు న్నారు. ఒక సాధారణ ధ్రువీకరణ పత్రం కో సం సైతం వారాలు, నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.

‘ఈరోజు కాదు... రేపు రండి‘, ‘ఫైల్ ఇంకా పరిశీలనలో ఉంది‘, ‘ఆర్‌ఐ ఫీల్డ్కు వెళ్లారు‘, ‘తాహసీల్దార్ సమావేశంలో ఉన్నారు‘, ‘సర్వర్ పనిచేయడం లేదు‘, ‘సంతకం కాలేదు‘ వంటి సమాధానాలు దా దాపు ప్రతి రోజు వినాల్సి వస్తోందని దరఖాస్తుదారులు చెబుతున్నారు. ఒక కౌంటర్ నుంచి మరో కౌంటర్కు పంపిస్తూ చివరకు ప ని పూర్తికాక వెనుదిరిగే పరిస్థితి నెలకొన్నట్లు పేర్కొంటున్నారు. ఈబీసీ, ఈడబ్ల్యూ ఎస్, ఆదాయ, కుల, నివాస, కుటుంబ స భ్యుల ధ్రువీకరణ పత్రాలు, వారసత్వ ధ్రువీకరణలు, వ్యవసాయానికి సంబంధించిన పత్రాలు, ఇతర రెవెన్యూ సేవల కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే వాటిలో గణనీయమైన సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లోనే ఉండిపోతున్నాయని ప్రజలు చెబుతున్నారు.

ఒకసారి దరఖాస్తు చేసిన తర్వాత పలుమార్లు కార్యాలయానికి వెళ్లినా పని పూర్తికాక సమయం, డబ్బు రెండూ వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అర్బన్, రూరల్ తాహసీల్దార్ కార్యాలయాల్లో దాదాపు ఒకే పరిస్థితి నెలకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచే వందలాది మంది కార్యాలయాలకు చేరుకుని గంటల తరబడి నిరీక్షిస్తున్నా, చాలామందికి అదే రోజు సేవలు అందడం లేదని పేర్కొంటున్నారు.

అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఆలస్యాలకు ఒక కారణంగా కనిపిస్తోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. .ఈ పరిస్థితి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుంది ,స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, కాలేజీ ప్రవేశాలు, హాస్టల్ అడ్మిషన్లు, పోటీ పరీక్షలు, ఉద్యోగ నియామకాల కోసం అవసరమైన ధ్రువీకరణ పత్రాలు గడువులోగా అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఆలస్యం కారణంగా విలువైన అవకాశాలు కోల్పోతామేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరీంనగర్ అర్బన్, రూరల్ తాహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అత్యంత బాధాకరం. 

ఒక కుల, ఆదాయ, నివాస లేదా ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రం కోసం వారాలు, నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి ప్రజా పాలనలో ఉండకూడదు. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రభుత్వం డిజిటల్ సేవల గురించి చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సేవలు వేగంగా అందకపోతే ప్రజలకు వాటి వల్ల ప్రయోజనం ఉండదు. ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించే విధానం అమలు చేయాలి.

పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలి.జిల్లా కలెక్టర్ వెంటనే సమీక్ష నిర్వహించి, తాహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి. ప్రజలు కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగకుండా పారదర్శకమైన, జవాబుదారీతనం కలిగిన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి.--

నర్సింగోజు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు,  బీసీ యువజన సంఘం