కొత్త బస్టాండ్ లో బుంగ పూడ్చివేత
బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో కొత్త బస్టాండ్ (Bellampalli New Bus Stand)లో ఏర్పడిన భారీ బుంగ ను పూడ్చి వేశారు. 31న ఆర్టీసీ బస్టాండ్లో ఆకస్మికంగా భారీ బుంగ ఏర్పడింది. ఆ సమయంలో అక్కడ ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు అయ్యింది. సంఘటన సమాచారం తెలియగానే బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్,మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి, ఆసిఫాబాద్ డీఎం రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ మందమర్రి సింగరేణి జీఎం రాధాకృష్ణ తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
వెంటనే బుంగ ను పూడ్చి వేయాలని ఎమ్మెల్యే కోరారు. దీంతో సింగరేణి,మునిసిపల్ అధికారుల పర్యవేక్షణలో బస్టాండ్లో బుంగను జేసిబీ యంత్రంతో పూడ్చి వేశారు. మట్టితో గోతిని పూర్తిగా పూడ్చి వేశారు. అయితే సాధారణంగా ఇలాంటి సంఘటనపై అధికారులు శాస్త్రీయ నివారణ చర్యలు తీసుకోవాలి. ముందుగా బుంగ ను ఇసుకతో నింపాలి. అలా కాకుండా అందుకు విరుద్ధంగా అధికారులు మట్టితో సరిపెట్టారు. బుంగ పూడ్చడంలో నాణ్యత ప్రమాణాలను విస్మరించారన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొక్కుబడిగా మట్టితో బుంగ ను నింపి చేతులు దులుపుకున్నారు.






