శ్రీలంకతో సిరీస్‌కు బుమ్రా దూరం
అకీబ్ నబీకి పిలుపు?
ముంబై, ఆగస్టు 2: శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంక టూర్‌కు దూరమమయ్యాడు. జూలై 28న ప్రకటించిన భారత 15 మంది సభ్యుల జట్టులో బుమ్రాకు చోటు కల్పించినప్పటికీ, అతని ఫిట్‌నెస్‌పై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని బీసీసీఐ ముందే పేర్కొంది.
ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో అతడిని ఈ సిరీస్‌కు దూరంగా ఉంచాలని బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం బుమ్రా ఫిట్‌నెస్ టెస్టులో పాసైనట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజా వైద్య పరీక్షల్లో ఎడమ మోకాలిలో ఇంకా ఇబ్బంది ఉన్నట్టు వైద్య బృందం గుర్తించినట్లు సమాచారం. దీంతో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు. అంతర్జాతీ య సిరీస్‌లతో బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో బుమ్రా విషయంలో ఎలాంటి పొరపాటు చేయకూడదని బీసీసీఐ భావిస్తోంది.
ఈ ఏడాది ఆసి యా క్రీడలు, న్యూజిలాండ్ పర్యటన, వచ్చే ఏడాది జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వంటి కీలక సిరీస్‌లు ఉండటంతో బుమ్రా విషయంలో తొందరపడకూడదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సూచించాడు. బుమ్రా స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ అకీబ్ నబీదార్ రేసులో ముందున్నట్టు సమాచారం.






