జిల్లాలో 141 మంది పిల్లల సంరక్షణ
పిల్లలను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు
అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): నెల రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో జరిగిన ఆపరేషన్ ముస్కాన్ విజయవంతమైందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆది వారం విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో 141 మంది పిల్లలను రక్షించి, నిందితులపై కేసులు నమోదు చేశామన్నారు.
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్త్మ్రల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం కోసం ఈ సంవత్సరం జులై 1 నుంచి 31 వరకు పోలీస్ శాఖ, చైల్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా చైల్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, హెల్త్ డిపార్ట్మెంట్, వివిధ శాఖల అధికారులతో జిల్లాలో బృందాలుగా ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 141 మంది బాలబాలికలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చామన్నారు.
18 ఏండ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పని చేయిస్తున్న 53 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. వీధి బాలలను చూసినప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం చేయడానికి సహకరించిన అన్ని శాఖల అధికారులను ఈ సందర్భంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.






