ఆటలు మనిషిని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి
వరంగల్ సీపీ ఎన్.శ్వేత
హనుమకొండ, ఆగస్టు 2 (విజయక్రాంతి): ఆటలు మనిషిని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతాయని వరంగల్ సిపి ఎన్.శ్వేత అన్నారు. తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అథ్లెటిక్ టెక్నికల్ ఆఫీసర్స్ సెమినార్ లో వరంగల్ సిపి ఎన్.శ్వేత ముఖ్య అతిథిగా పాల్గొనీ మాట్లాడుతూ వరంగల్ స్టేడియం చూడగానే చాలా సంతోషం అనిపించిందని, హైదరాబాద్ లాంటి పట్టణాలలో ఉన్న స్టేడియంలతో పోలిస్తే వరంగల్ లో ఉన్న క్రీడాకారులు అదృష్టవంతులు అన్నారు.
క్రీడాకారులకు అన్ని విధాలుగా అందుబాటులో క్రీడా మైదానం ఉందని అన్నారు. అన్ని రకాల క్రీడల అసోసియేషన్ ప్రతినిధుల తోడ్పాటు వల్లే స్టేడియం ఆటలకు అనుకాలంగా ఉందన్నారు. వరంగల్ జిల్లాలో ని క్రీడాకారులే కాకుండా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న అనేకమంది క్రీడాకారులకు వరంగల్ లోని జెఎన్‌ఎస్ స్టేడియం ఉపయోగపడుతుందన్నారు. క్రీడల వల్ల మనిషికి క్రమశిక్షణ అలవడు తుందని, తద్వారా క్రమశిక్షణ గల సమాజాన్ని నిర్మించవచ్చు అన్నారు.
ఆటలు మనిషిని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దు తాయని, ఆటలతో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు అన్నారు. ఉత్తర తెలంగాణలో వరంగల్ ఎడ్యుకేషన్ హబ్ గా అభివృద్ధి చెందిందని, అదేవిధంగా స్పోరట్స్ హబ్ గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాంతంలో క్రీడాకారులకు కొదవలేదని, సరైన అవకాశాలు కల్పిస్తే దేశ స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఉన్నత ఫలితాలు సాధించవచ్చు అన్నారు.
ఇలాంటి కార్యక్రమాలకు తన వంతు ప్రోత్సాహం ఎల్లవేళలా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ఆర్య వైశ్య సంఘం జాతీయ నాయకులు గట్టు మహేష్ బాబు చేతుల మీదుగా వరంగల్ సిపి కి స్పోరట్స్ ట్రాక్ సూట్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె .సారంగపాణి, ఆర్యవైశ్య సంఘం జాతీయ నాయకులు గట్టు మహేష్ బాబు, తెలంగాణ టెక్నికల్ అథ్లెటిక్ అసోసియేషన్ చైర్మన్ జగన్, హరిదాసు,వాసుదేవరావు, తదితరులు పాల్గొన్నారు.






