24 June, 2026 | 1:26 AM

హస్తినపై ఇసుక తుఫాను

24-06-2026 12:23 AM

వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ

గంటకు 100 కి.మీ వేగంతో గాలులు

తుఫాను తర్వాత తేలికపాటి వర్షాలు

న్యూఢిల్లీ, జూన్ ౨౩: ఇసుక తుఫానుకు ధాటికి దేశ రాజధాని ఢిల్లీ విలవిలలాడింది. మంగళవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి గంటకు 100 కి.మీ వేగంతో వీచిన ఈదురు గాలులు జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. తుఫాను తర్వాత అక్కడక్కడా తేలికపాటి వర్షం కూడా కురిసింది. బలమైన గాలులకు కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలవాలాయి.

విద్యుత్ తీగలూ తెగిపోయాయి. ఫలితంగా నగరం అంధకారంలోకి వెళ్లింది. తుఫాను తాకిడికి రహదారులన్నీ ఇసుకతో నిండిపోయాయి. దీంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడ్డారు. తుఫాను నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) యావత్ ఢిల్లీకి రెడ్ అలెర్ట్ ప్రకటించింది.

వాయువ్య భారతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగాయని, దీంతో వాతావరణంలో ఊహించని మార్పులు వచ్చాయని, తత్ఫలితంగా తుఫాను ఏర్పడిందని స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న సమయంలో ఇలాంటి తుఫానులు సహజమని పేర్కొంది. ఢిల్లీతో పాటు హర్యానాలోని సోనిపట్, రోహ్‌తక్, భివానీ, ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్, పిలాఖువా, రాజస్థాన్‌లోని అల్వార్, డీగ్ పట్టణంపైనా ఇసుక తుఫాను ప్రతాపం చూపించింది. తుఫాను ఉన్నప్పుడు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, వాహన ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఆయా ప్రాంతాల అధికారులు హెచ్చరించారు.