24 June, 2026 | 2:29 AM

రైతులను పట్టించుకోని బీఆర్‌ఎస్

24-06-2026 01:23 AM

మొసలి కన్నీరు కారుస్తున్న హరీష్‌రావు

కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను వదులుకున్నారు

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం

రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు 

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): రైతుల కోసం మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మాజీ మంత్రి హరీష్‌రావు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని మంత్రి విమర్శించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ  కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, మధుసూదన్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. మిగులు రాష్ట్రాన్ని రూ. 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, విద్యుత్ డిస్కంలను కూడా అప్పుల్లో ముంచారని మండిపడ్డారు.

ఒకేసారి రుణమాఫీ చేయలేమని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. రూ. లక్ష రుణమాఫీకి నాలుగు సంవత్సరాల సమయం తీసుకున్నారని, తమ ప్రభుత్వం మాత్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, రూ. 2 లక్షల వరకు ఒకేసారి రుణమాఫీ చేశామని, ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయంలో ఎకరానికి రూ. 5 వేలు రైతుబంధు ఇస్తే తమ ప్రభుత్వం ఎకరాకు రూ. 6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోందని, సన్నాలకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తున్నామన్నారు.

వరి వేస్తే ఊరే అన్న కేసీఆర్, రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా  పాలన చేయలేదన్నారు. ప్రాజెక్ట్‌ల పేరుతో బీఆర్‌ఎస్ నాయకులు లక్షల కోట్లు దోచుకున్నారని, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను వదులుకున్నారని ఆరోపించారు. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్ట్‌లపై పదేళ్లలో కేవలం 6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ. 8 వేల కోట్లు ఖర్చు చేసిందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.