30 July, 2026 | 2:04 AM

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ మనందరి బాధ్యత

30-07-2026 01:26 AM

కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, జూలై 29 (విజయక్రాంతి): విద్యార్థులు విద్య, క్రీడలు, ఇతర రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలంటే వారి ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం పట్టణంలోని భుక్తాపూర్ పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గెజిటెడ్ నంబర్1)లో నిర్వహించిన కంటి వైద్య శిబిరం, ఆరోగ్య పాఠశాల, వన మహోత్సవ కార్యక్రమాలకు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో కలిసి హాజరై మాట్లాడారు.

విద్యార్థులకు ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు, హెల్త్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కంటి సమస్యలు ఉన్న విద్యార్థులకు అవసరమైన కళ్లద్దాలు, వైద్య చికిత్సలు, అవసరమైతే శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా అందజేస్తామని చెప్పారు.

విద్యార్థుల విద్యాభివృద్ధికి నిరంతర హాజరు ఎంతో అవసరమని, ఈ విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థి కనీసం 200 రోజుల పాటు పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఆగస్టు 15 నాటికి నాణ్యమైన మఫత్లాల్ వస్త్రంతో తయారు చేసిన ఒక జత బ్లూ కలర్ యూనిఫామ్లను ఉచితంగా అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ’వెస్ట్ టు వండర్’ గార్డెన్ను పరిశీలించి వ్యర్థ వస్తువులతో వినూత్నంగా తీర్చిదిద్దిన సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాధన, వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు నీలదేవి, ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటర్లు వెంకటరమణ, రంజిత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.