సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆర్టీసీ కార్మికుల ధర్నా
బీజేపీ, బీఆర్‌ఎస్, సీపీఐ పార్టీల సంఘీభావం
బాన్సువాడ, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు గురువారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కార్మికులకు మద్దతుగా బీజేపీ, బీఆర్‌ఎస్ సిపిఐ పార్టీల నాయకులు కూడా సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. మండుటెండలో ఆర్టీసీ డిపో నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక నాయకులు, జేఏసీ నాయకులు, బీజేపీ నాయకులు కొనాల గంగారెడ్డి, శంకర్ గౌడ్, గుడుగుట్ల శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నాయకులు అంజిరెడ్డి, షేక్ జుబేర్, షేక్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ, ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు..
గురువారం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. బాన్సువాడ బస్సు డిపో వద్దకు వెళ్లి కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.సీపీఐ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుభాస్ రాములు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసమే సమ్మె చేస్తున్నారని, ప్రభుత్వం స్పందించి డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కార్మికులకు పని భారం పెరిగిందని, ఇప్పటివరకు వేతన సవరణ చేయకపోవడం సరికాదని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికుల టెంట్ను పోలీసులు అకారణంగా తొలగించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు.ఏఐటీయూసీ బాన్సువాడ డివిజన్ కార్యదర్శి డి. శంకర్ మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ కార్మికులకు పని భారం పెరిగిందని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సతీష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు






