15 July, 2026 | 1:42 AM

ఎబిక్స్ చైర్మన్ వికాస్‌గార్గ్ అరెస్ట్

15-07-2026 01:41 AM

బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు

న్యూఢిల్లీ, జూలై ౧౪: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసుతో ప్రమేయం ఉండి, మనీ లాండరింగ్ వ్యవహారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎబిక్స్ చైర్మన్ వికాస్ గార్గ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం ఢిల్లీలో అరెస్ట్ చేసింది. స్థానిక కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ పొందిన ఈడీ అధికారులు నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు తరలించారు. బుధవారం ఈ మేరకు రాయ్‌పూర్‌లోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరో వైపు, ఈడీ ఇప్పటికే గార్గ్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.940.77 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.

గార్గ్ ‘వికాస్ ఎకోటెక్ లిమిటెడ్’, ‘వికాస్ లైఫ్‌కేర్ లిమిటెడ్’, ‘ఎరాయా లైఫ్‌స్పేసెస్ లిమిటెడ్’ అనే మూడు లిస్టెడ్ కంపెనీలకు ప్రమోటర్‌గా వ్యవహరించాడు. అక్రమ బెట్టింగ్ నెట్‌వర్క్ ద్వారా వచ్చిన సొమ్మును గార్గ్ తన ఆధీనంలోని సంస్థల్లోకి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఈ నిధులను వివిధ కంపెనీల ద్వారా లేయరింగ్ చేసి, షేర్లు, సెక్యూరిటీలు, ఇతర ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఉపయోగించారని దర్యాప్తు సంస్థ నిర్ధారించింది.