అభివృద్ధిని ప్రతిబింబించే విధంగా ‘పైలాన్’ నిర్మాణం
కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు, జులై 14 (విజయక్రాంతి): ములుగు గట్టమ్మ వద్ద జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, జిల్లా ప్రగతిని ఒకేచోట ప్రతిబింబించేలా ఏర్పాటు చేస్తున్న ‘పైలాన్’ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న కలెక్టర్, నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పైలాన్ను ప్రారంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
పనుల అమలులో ఎలాంటి రాజీ పడకుండా నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయం ఆవరణలో చేపడుతున్న ల్యాండ్స్కేపింగ్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ మొక్కలు నాటాలని, లాన్ అభివృద్ధి, అలంకరణ మొక్కల ఏర్పాటు, నడక మార్గాల నిర్మాణం, సుందరీకరణ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి ఆవరణను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈ ఈ అజయ్ కుమార్, హార్టికల్చర్ అధికారి సంజీవరావు, మున్సిపల్ కమిషనర్ సంపత్, గుత్తేదారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






