మెదక్ కోట పునరుద్ధరణ, పరిరక్షణకు పటిష్ట చర్యలు
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, మే 21(విజయ క్రాంతి) : మెదక్ కోట పునరుద్ధరణ, పరిరక్షణపై పురావస్తు శాఖ సమన్వయంతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ తెలిపారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో మెదక్ కోట పునరుద్ధరణ, పరిరక్షణపై చర్చించేందుకు పురావస్తు శాఖ డైరెక్టర్ సంబంధిత అధికారులతో గురువారం కలెక్టర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ అర్జున్ రావు, డాక్టర్ నాగరాజు, డిప్యూటీ డైరెక్టర్, శ్రీ ఎన్. నరసింగ్, డిప్యూటీ డైరెక్టర్ (ఇంజనీరింగ్), డిపిఆర్‌ఓ రామచంద్ర రాజు, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, ఈడియం సందీప్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
కోట వద్ద పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల పనులకు సంబంధించిన వివిధ అంశాలపై పురావస్తు శాఖ అధికారులతో చర్చించడం జరిగిందని తెలిపారు. మెదక్ కోట చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత కలిగిన ఒక కొండ కోట. దీనిని మొదట 12-13వ శతాబ్దాలలో కాకతీయ కాలంలో నిర్మించగా, తదనంతరం కుతుబ్ షాహీ పాలకులు దీనిని మరింత పటిష్టం చేశారు. ఈ కోట దాని వ్యూహాత్మక ప్రదేశం, ప్రాచీన ద్వారాలు, ఫిరంగి స్థావరాలు, వాస్తు నిర్మాణ అవశేషాలు మరియు మెదక్ పట్టణం యొక్క విశాల దృశ్యానికి ప్రసిద్ధి చెందింది. ఇది తెలంగాణ యొక్క గొప్ప సాంస్కృతిక, సైనిక చరిత్రను ప్రతిబింబించే ముఖ్యమైన వారసత్వ కట్టడాలలో ఒకటి.
సమగ్ర అభివృద్ధి పనుల కోసం గతంలో ప్రతిపాదించిన 6.20 కోట్ల అంచనాను ఇప్పుడు సుమారు 10 కోట్లకు సవరించినట్లు తెలిపారు. మెదక్ కోట అభివృద్ధి, పరిరక్షణ కోసం వీలైనంత త్వరగా వివరణాత్మక అంచనాను సమర్పించాల్సిందిగా కలెక్టర్ పురావస్తు శాఖ డైరెక్టర్ను కోరారు. మెదక్ కోటను ఒక ప్రముఖ వారసత్వ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి, పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను సమీకరించడంలో మద్దతు ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






