అవుట్‌సోర్సింగ్ పోస్టుల నియామక పరీక్షలు
పరీక్షల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ టౌన్, జూలై 3 (విజయక్రాంతి): జిల్లా స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న పోస్టుల నియామక ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించినట్లు జనగామ జిల్లా కలెక్టర్, జిల్లా అవుట్సోర్సింగ్ కమిటీ ఛైర్మన్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన నియామక పరీక్షల సరళిని శుక్రవారం అదనపు కలెక్టర్ బెన్షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేలా పరీక్షలను నిష్పక్షపాతంగా నిర్వహించడం జరిగిందన్నారు.
జూలై 2న వ్యవసాయ శాఖకు సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారి పోస్టుల భర్తీకి, జూలై 3న వైద్య శాఖకు సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్, ఎస్టీఎల్‌ఎస్ పోస్టుల కోసం, అనంతరం విద్యా శాఖకు సంబంధించిన లో పార్ట్ టైమ్ టీచర్ల పోస్టుల కోసం పరీక్షలను నిర్వహించినట్లు స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ ఏ ఈ వో పోస్టులకు 94 మంది, వైద్య శాఖ ల్యాబ్ టెక్నీషియన్ కు 75 మంది, సోషల్ వెల్ఫేర్ విద్యా సంస్థల పార్ట్ టైమ్ టీచర్ పోస్టులకు 82 మంది పరీక్షకు హాజరయ్యారు.






