‘బ్రిక్స్’ దేశాల సహకారం బలోపేతం కావాలి
- కార్మిక సంఘాల సహకారం మరింత అవసరం
- హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
- 4 నుంచి 16 వరకు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ ఫోరం సమ్మిట్
ముషీరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): బ్రిక్స్ దేశాల మధ్య కార్మిక సంఘాల సహకారం మరింత బలోపేతం కావాలని, ప్రపంచ కార్మిక రంగంలో వస్తున్న మార్పులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో సమన్వయం అవసరమని హర్యానా మాజీ గవర్నర్, కేంద్ర మాజీ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని తేంగడి భవన్లో ఏర్పాటు చేసిన సమ్మిట్ సచివాలయాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మికుల సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్ర ఆర్థికాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ ఫోరం సమ్మిట్ ద్వారా సభ్య దేశాల కార్మిక సంఘాల మధ్య స్నేహబంధం, పరస్పర సహకారం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ ఫోరం సమ్మిట్2026 చైర్మన్ సుంకరి మల్లేశం మాట్లాడుతూ ఈ నెల14 నుంచి16 వరకు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ ఫోరం (టఫ్) సమ్మిట్2026 హైదరాబాద్ లో జరగున్నట్లు తెలిపారు. ప్రపంచ కార్మిక రంగానికి సంబంధించిన సమకాలీన అంశాలపై చర్చించేందుకు ఈ సమ్మిట్ విశిష్ట వేదికగా నిలుస్తుందన్నారు.
అందరికీ సామాజిక భద్రత, మహిళలుభవిష్యత్ ఉద్యోగాలు, భవిష్యత్తు కోసం నైపుణ్యాలు, మానవ కేంద్రిత సాంకేతికతకృత్రిమ మేధస్సు, కార్మికుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై విస్తృత చర్చలు జరుగుతాయని చెప్పారు. ఈ సమ్మిట్లో 14 బ్రిక్స్ దేశాల నుంచి 50 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, భారతదేశం నుంచి సుమారు 70 మంది ప్రతినిధులు, బీఎంఎస్, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్ తదితర కేంద్ర కార్మిక సంఘాల నాయకులు, కార్మిక నిపుణులు, విద్యావేత్తలు పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో బీఎంఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్, ఐఎన్టీయూసీ అఖిల భారత ఉపాధ్యక్షుడు సత్యజిత్ రెడ్డి, హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బ రామారావు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్, బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. రామిరెడ్డి, రాష్ట్ర సంఘటనా కార్యదర్శి రామ్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.






