సాహిత్యానికి ముక్త‘వరం’
తెలుగు సాహిత్య ప్రపంచంలో ముక్తవరం పార్థసారథి ఒక ప్రత్యేకమైన సంతకం. సామాన్య పాఠకుడికి ప్రపంచ సాహిత్యం అందుబాటులోకి రావాలంటే అనువాదం ఒక వంతెన కావాలి. ఆ వంతెనను నిర్మించడంలో ఆయన జీవితాన్ని ధారపోశారు. చైనా, ఆఫ్రికన్ జానపద కథలు, నోబెల్ పురస్కారాలు పొందిన సాహితీవేత్తల రచనలను తెలుగు పాఠకులకు అందించారు. విదేశీ రచనలతో పాటు సొంతంగానూ ఆయన నవల లు, కథలు రాశారు. అంతర్జాతీయ సాహిత్యంపై సాధికారత కలిగిన అతి తక్కువ మం ది తెలుగు వారిలో ముక్తవరం ఒకరు.
ఆయ న అనువాదాలు మొత్తం 65కుపైగా పుస్తకాలుగా వెలువడ్డాయి. ఆయన ఓ ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగిగా పనిచేసినప్పటికీ, ఆయన తపనంతా సాహిత్యరంగంపైనే ఉండేది. ముక్తవరం నల్లగొండ జిల్లా భువనగిరి గడ్డ మీద 1944 జూలై 7న జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయన సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ఆయనలోని సృజనాత్మకతను వెతు క్కుంటూ యౌవన ప్రాయంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. తిరువన్నామలై వెళ్లి చలంతో సంభాషించిన తర్వాత, ఆయన జీవి తం మలుపు తిరిగింది. నాటి పేదరికం, సంఘర్షణలు ఆయనను మరింత బలమైన రచయితగా తీర్చిదిద్దాయి.
పది నవలలు..
‘శూన్యం’, ‘రంగుల వల’, ‘పరువు’, ‘మనసులోని చలి’, ‘నువ్వూ నేనూ.. చిన్నారావూ’, ‘కౌగిలి’, ‘కించిద్విషాదం’ లాంటి పది నవలలు రాశారు. ఆయన నవలల్లో ఆయన స మకాలీన సమాజపు మానసిక వికారాలు, అనైతిక రాజకీయ పోకడలను చిత్రించారు. ప్రతి మనిషిలోనూ అవతలి కోణం ఉంటుందని, కొందరిలో నమ్మలేని చీకటి కోణాలుం టాయని ఆయన రచనలను అధ్యయనం చేస్తే మనకు అవగతమవుతుంది. జాక్ లం డన్ రాసిన ‘ఐరన్ హీల్’ను ‘ఉక్కుపాదం’గా తెలుగు పాఠకులకు పరిచయం చేయడం ఆయన సాహిత్య ప్రస్థానంలో ఒక గొప్ప మలుపు. వర్గ దోపిడీని, విప్లవ పోరాటాన్ని ఇంత శక్తిమంతంగా చెప్పడం తెలుగులో అరుదు.
‘హాజి మురాద్’, ‘రిచర్డ్ బాక్’, ‘సీగల్’, ‘ఇసాబెల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత రచనలను ఆయన తెలుగులోకి తీసుకువచ్చారు. ‘నోబెల్ తారలు’ పేరిట ౩౫ మంది నోబెల్ బహుమతి గ్రహీతల కథలను, వారి పరిచయాలను అందించడం ఒక సాహసోపేతమైన యజ్ఞం. ఒక రచయితగా ముక్తవరా నికి నిశ్చితమైన అభిప్రాయాలుండేది. కులాసాగా కూర్చొని, నింపాదిగా చదువుకునేది సాహిత్యం కాదని, సాహిత్యం ఏమాత్రం కాలక్షేపం కాదని ముక్తవరం భావించేవారు. సీరి యస్ పాఠకులు, రచయితలంటే ఆయనకు అపారమైన గౌరవం.
మనిషి తనను తాను నిరంతరం ప్రశ్నించుకోవాలని, తన పనితనం మీద తనకే అసహనం ఉండాలని చెప్తుండేవారు. ముక్తవరం కథల్లోని పాత్రలు తమ కలల్లోకి వచ్చి, కొన్నాళ్లు తమను వెంటాడయని ఎంతో మంది పాఠకులు, అభిమా నులు ఇప్పటికీ చెప్తున్నారంటే ఆయన రచనా శైలి ఎంతటిదో అంచనా వేయవచ్చు. ఇదే కోవలో ‘పరువు’ నవల మనుషుల బాధలను, కన్నీళ్లను కొన్ని పాత్రల ద్వారా తెలిపా రు. జీవిత కాలంలో ౫ ౬ వేల పేజీల అనువాద సాహిత్యాన్ని సృజించారంటే ఆయన కృషి ఎంతటిదో ఊహించవచ్చు. ఒక దేశపు సంస్కృతిని, ఒక దేశ ప్రజల వేదనను తెలుగు పాఠకుడికి పంచాలనే ఆయన రచనల్లో కనిపిస్తుంది. తన సమయన్నంతా ప్రపంచ రచ యితల రచనలు చదువుకుంటూ, సమయానికి ఒక కప్పు టీ తాగుతూ గడపడమే ఆయ నకు తెలిసిన జీవిత పరమార్థం.
నిరాడంబర జీవితం
ముక్తవరం స్నేహానికి ఎంతో విలువిచ్చేవారు. గుడిపాటి వెంకట చలం ఒకసారి వరవరరావుకి రాసిన ఒక ఉత్తరంలో ‘హైదరాబాదులో కోఠీకి దగ్గరే ఎక్కడో పార్థసారథి అని ఒక రచయిత ఉంటారు. వీలైతే వెళ్లి కలవండి’ అని కోరారు. చలం చెప్పారు కాదు.. వరవరరావు వెంటనే వెళ్లి పార్థసారథిని కలిశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఈ ఘటన జరిగింది 1961లో. అంటే.. ఆరు దశాబ్దాల క్రితం. అప్పుడు ముక్తవరం వయసు 17 ఏళ్లు. అంటే ఆ వయస్సులోనే చలానికి మి త్రుడయ్యారంటే, ముక్తవరం సాహిత్యాభిలాష ఎంతటిదో ఊహించవచ్చు.
వరవరరావు కూడా ‘ముక్తవరం.. నాకు చలం ఇచ్చిన స్నేహితుడు’ అని చెప్తుంటారు. తన ఇంట్లో, తన గదిలో వేలాది పుస్తకాల మ ధ్య సమయం గడిపేందుకు ముక్తవరం ఇష్టపడేవారు. జీవిత కాలం ఆయన నిశ్శబ్ద జీవిత మే గడిపారు. పఠనం, రచనలోనే తనకు నిజమైన సంతృప్తి లభిస్తుందని తరచూ చెప్తుండే వారు.
సభలు, సన్మానాలు, హంగులూ ఆర్భాటాలకు పూర్తిగా ఎడంగా ఉన్నారు. కొత్త రచ యితలకు ఆయనో మార్గదర్శి. ‘ఒక కథ లేదా నవల రాయలంటే, ఒక రచయిత ఎలాంటి వస్తువు, శిల్పాన్ని ఎలా ఎంచుకోవాలి..’ అన్న విషయాల్లో ఆయనో దిక్సూచి. ఏ రచయిత అయితే, తన రచనలోని పాత్రల చిత్రణ కోసం కన్నీళ్లు పెట్టుకుంటాడో, ఆ రచన అజరామరంగా నిలుస్తుందని నమ్మేవారు. తన రచనల్లోనూ అదే సూత్రాన్ని పాటించేవారు. ౮౦ ఏళ్ల పడి దాటి వృద్ధాప్య సమస్యలు ఎదుర్కొంటున్నా, అనారోగ్యం వేధిస్తున్నా, చివరి వరకు ఆయన పఠనశీలిగానే ఉన్నారు. పుస్తకాలు లేని జీవితాన్ని ఊహించుకోలేని ఒక గొప్ప చదువరి ఆయన. ఈ అరుదైన సాహితీవేత్త ఈనెల ౩న కన్నుమూశారు. ఆయన కిదే అక్షర నివాళి!!
విశ్వ




