21 March, 2026 | 9:16 PM

భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా ముగిసిన రంజాన్

21-03-2026 04:01 PM

ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు 

కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు

స్వయంగా బందోబస్తును పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర

ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల్లో, మండల కేంద్రాలు, గ్రామాల్లోని ఈద్గా ల వద్ద ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టు ఈదుగా మైదానంలో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన సామూహిక ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తును జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా సమగ్ర భద్రతా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఈద్గా మైదానానికి చేరుకున్న ఎస్పీ బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి తగిన సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా ఈద్గాల వద్దకు వచ్చే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. పవిత్ర రంజాన్ ప్రార్థనలు అత్యంత క్రమశిక్షణతో, శాంతియుత వాతావరణంలో ముగియడం జరిగింది అని తెలిపారు.

అనంతరం, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రభుత్వ సలహాదారు  మహమ్మద్ అలీ షబ్బీర్ ని కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా జిల్లా ముస్లిం సోదరులందరికీ పండుగ అభినందనలు తెలుపుతూ, సమాజంలో సోదరభావం, ఐక్యత మరింత పెంపొందాలని ఆయన పిలుపునిచ్చారు. భక్తుల రాకపోకలు పూర్తిగా ముగిసే వరకు బందోబస్తు కొనసాగుతుందని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరిస్తున్న ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఏఎస్పీ  బి. చైతన్య రెడ్డి, టౌన్ ఎస్‌హెచ్‌ఓ  నరహరి , ఎస్‌ఐలు, ముస్లిం సోదరులు, ప్రజలు పాల్గొన్నారు.