21 May, 2026 | 2:15 AM

టాఫీలను పంచుతూ బిజీగా ప్రధాని

21-05-2026 12:42 AM

ప్రధాని, హోంమంత్రి దేశద్రోహులే

అమేథీలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

లక్నో, మే 20: ఓ వైపు దేశంలో ఆర్థిక తుఫాను రాబోతుంటే ప్రధాని నరేంద్ర మోదీ ‘మెలోడీ టాఫీ’లను పంచుతూ బిజీగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా, మీ సంస్థ దేశద్రోహులని దేశాన్ని అమ్ముకుంటున్నారని సంచలన వ్యాఖ్యాలు చేశారు.

రాయ్‌బరేలీ పర్యటన అనంతరం అమేథీకి చేరుకున్న రాహుల్‌గాంధీ బుధవారం మీడియాతో మాట్లాడారు. కోవిడ్, పెద్దనోట్ల రద్దు సమయాల్లో కూడా ప్రధాని మిమ్మల్ని కాపాడలేకపోయారని, ప్రస్తుతం రాబోయే ఆర్థిక తుఫాను నుంచి కూడా ఆయన మిమ్మల్ని కాపాడలేరని అన్నారు. దేశవ్యాప్తంగా ఓ వైపు వ్యాపారాలు దెబ్బతింటూ, మూతపడుతున్నాయని అన్నారు.

తాను క్షమాపణలు చెప్పేది లేదని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చిన వ్యక్తులు మీరేనని ఆరోపించారు. ప్రతిష్ఠాత్మకమైన నీట్ పేపర్‌ను లీకేజీ చేయించి లక్షలాది మంది విద్యార్థుల మనోభావాలతో చెలగాటమాడారన్నారు. మరోవైపు పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయన్నారు. మీ ఎదురుగానే ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తులు రాజ్యాంగ పత్రులను చింపివేస్తుంటూ చూస్తూ ఉరుకుంటున్నారని, రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మీపై లేదా? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అనంతరం సంజయ్ గాంధీ ఆసుపత్రిలోని రోగులను రాహుల్ గాంధీ పరామర్శించారు.