ప్రొటోకాల్ రగడ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటనలో చోటుచేసుకున్న ప్రొటోకాల్ వివాదం పెద్ద దుమారం రేపింది. ఒక్క ప్రొటోకాల్ వివాదం రాజకీయ పోరాటాలుగా ఎంత వేగంగా మారిపోతాయనడానికి తాజాగా ఘటనే ఉదాహరణ. దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి విషయంలోనూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్రపతి పర్యటన సమయంలో, ఆమె పర్యటించిన రోడ్డు పొడవునా చెత్తాచెదారం పేరుకుపోవడంపై రాష్ట్రపతి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు.
తనకు స్వాగతం పలికేటప్పుడు, తిరిగి వీడ్కోలు పలికే సమయంలో ముఖ్యమంత్రి మమత బెనర్జీ లేకపోవడం అవమానకరమని రాష్ట్రపతి భావించారు. ఇది రాష్ట్రపతికి వ్యక్తిగతంగా జరిగిన అవమానం మాత్రమే కాదని, రాష్ట్రపతి ప్రాతినిధ్యం వహిస్తున్న గిరిజన సమాజంపై కూడా జరిగిన దాడి అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వాణీకి భారతరత్న ప్రధానం చేసిన సమయాన్ని ఆమె గుర్తు చేశారు.
ఆ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలబడి ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ కూర్చుని ఉండటం ప్రొటోకాల్ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పర్యటన ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం జరిగిందని, ఆ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్యానికీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాము ప్రత్యేక కారణాల వల్ల రాష్ట్రపతికి స్వాగతం పలకలేకపోయామని, కానీ.. రాష్ట్రపతికి సిలిగురి మేయర్, ఇతర ప్రముఖులు స్వాగతం పలికారని గుర్తు చేశారు.
రోడ్ల పక్కన చెత్త కనిపించడమనేది దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక నగరాలు, పట్టణాల్లో సర్వ సాధారణంగా కనిపించే దృశ్యమేనని, ఈ అంశంపై ఎవరూ అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదని, అభ్యంతరాలు చెప్పాల్సిన అగత్యమూ లేదని కొట్టిపడేవారు. స్వచ్ఛ భారత్ మిషన్‌పై కేంద్ర ప్రభుత్వం ఎంత పట్టింపు ఉందో అందరికీ తెలిసిందేనని, అదొక నామమాత్రపు కార్యక్రమమేనని ఎద్దేవా చేశారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, బీజేపీ నేతలు పనిగట్టుకుని ప్రొటోకాల్ వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. కావాలనే, రాజకీయ దుమారం రేపుతున్నారని మండిపడ్డారు. ఏదేమైనా, బెంగాల్‌లో పాగా వేయాలని బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నది. దీనిలో భాగంగానే ఓటర్ల జాబితా సవరణ(సర్), పరిపాలనాపరమైన ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నది.
దీనిలో భాగంగానే రాష్ట్రంలో అలజడి సృష్టించి రాష్ట్రపతి పాలన విధింపునకు అనుకూల పరిస్థితులు కల్పిస్తున్నారని అధికార తృణమూల్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రాలు భాగస్వాములుగా పనిచేయాల్సిన ఫెడరల్ ప్రజాస్వామ్యానికి ప్రొటోకాల్ వివాదాలు పెద్దగా మేలు చేయవు. రాష్ట్రపతి పదవి దేశంలోనే అత్యున్నతమైన పదవి. ఆ పదవిలో ఉన్న వారిని కూడా రాజకీయ వివాదాల్లోకి లాగడం వాంఛనీయం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవలి కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న పెద్ద నేతల మధ్య ప్రొటోకాల్ వివాదాలు తరచూ తలెత్తుతున్నాయి. రాజకీయ విబేధాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు సవాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం ఉన్నప్పుడు ఇలాంటి ప్రొటోకాల్ ఉల్లంఘనలు తీవ్రమవుతున్నాయి.




