12 March, 2026 | 6:13 AM

హామీల అమలెప్పుడు?

12-03-2026 12:42 AM

ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఆపార్టీకి పట్టంకట్టారు. ముఖ్యంగా బీసీ వర్గాల సాధికారతపై ఇచ్చిన హామీలు ఎన్నికల సమయంలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. ఆ హామీల్లో ప్రధానమైంది కామారెడ్డి డిక్లరేషన్. డిక్లరేషన్ ద్వారా బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మరింత ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా, హామీలపై ఎలాంటి స్పష్టత లేదు.

ఇది బీసీ వర్గాల్లో ఆందోళన రేపుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో అది రాజ్యాంగబద్ధంగా కుదరలేదు. మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు ఎన్నికల్లోనైనా ముందు ప్రకటించిన కోటా ఖరారయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటే బీసీలు సంతృప్తి చెందుతారు. అలాగే, బీసీల సంక్షేమానికి యేటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించింది.

నిధుల ద్వారా బీసీలకు విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, సామాజిక అభివృద్ధికి బాటలు వేస్తామని హామీ ఇచ్చింది. కానీ, గత బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తే ఆ స్థాయిలో నిధులు కేటాయించలేదనేది స్పష్టమవుతుంది.  రెండేళ్లలో ఒక సంవత్సరం 9 వేల కోట్లు, మరో ఏడాది 11 వేల కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగాయి.  ఆ కేటాయించిన  బడ్జెట్‌నైయినా, ఖర్చు చేశారా? అంటే అది జరగలేదు. రాష్ట్రంలో బీసీ వర్గాలు జనాభాలో పెద్ద శాతం ఉన్న సమూహం.

ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో వారి జనాభా 56.33 శాతం. రాష్ట్ర నిర్మాణం నుంచి ఇప్పటివరకు రాజకీయంగా, సామాజికంగా తమకు తగిన ప్రాధాన్యత రావాలనే డిమాండ్ బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నో రాజకీయ పార్టీలు కూడా పోరాటం చేస్తున్నాయి. కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలు బీసీ వర్గాల్లో ఆశలు పెంచి, ఇప్పుడు అమలు చేయకపోవడం.. బీసీ సమాజం నుంచి తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.

రాజకీయ పార్టీలు ఎన్నికలల సమయంలో హామీలు ఇవ్వడం సహజమే. ఆ హామీలతో అధికారంలోకి వస్తే మాత్రం, వాటిని అమలు కావడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాల విధి. విశ్వసనీయతకు అదే మూలస్తంభం. ముఖ్యంగా సామాజిక న్యాయం, సమాన అవకాశాల వంటి అంశాలపై ఇచ్చిన హామీలు అమలవకపోతే అది పెద్ద రాజకీయ, సామాజిక చర్చకు దారితీస్తుంది. బీసీ వర్గాల సాధికారత కూడా అలాంటి కీలక అంశమే. ఇప్పటికైనా ప్రభుత్వం బీసీ సాధికారతపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాల్సిన అవసరం ఉంది. 

 -సిద్ధగౌని సుదర్శన్, వ్యాసకర్త సెల్: 97017 03684