12 March, 2026 | 2:43 AM

అసమగ్ర ‘మూసీ’ డీపీఆర్ వద్దు !

12-03-2026 12:51 AM

మూసీ పునరుద్ధరణ దశ డీపీఆర్‌ను విడుదల చేసేందుకు ప్రతి పాదిత కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని, ఈనెల 13న జరుగను న్న ఆ కార్యక్రమాన్ని నిలిపేయాలని ఆల్ ఇండియా రివర్స్ ఫోరం, నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్స్ (ఎన్‌ఏపీఎం) వ్యవస్థాపక సభ్యురాలు,  సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ తాజాగా సీఎంకు బహిరంగ లేఖ రాశారు.

మూసీ ప్రభావిత ప్రజలు, మూసీ జన ఆందోళన్ (ఎంజేయే) సభ్యుల పోరాటానికి మద్దతుగా నిలుస్తూ ఆమె ఈ లేఖ రాశారు. ఈ లేఖను ఆమె సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్, తెలంగాణ ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కూ చేరవేశారు.

మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం నుంచి తమకు అధికారిక ఆహ్వానం అందిందని ఆ ఆహ్వానంలో మూసీ పునరుద్ధరణపై అర్థమంతమైన చర్చలు జరిపే వేదిక అని పేర్కొన్నారని, కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన కార్యాచరణ  అమలుకావడం శోచనీయమని మేధా పాట్కర్ ఆం దోళన వ్యక్తం చేశారు.

బాధిత కుటుంబాల గోడు పట్టదా?

మూసీ పరీవాహకంలో భూసేకరణ నో టీసులు అందుకున్న కుటుంబాలు, పర్యావరణవేత్తలకు, సామాజిక కార్యకర్తలు, మూసీ ప్రభావిత ప్రజల తరఫున అండగా నిలబడుతున్న ‘మూసీ జన ఆందోళన్’ ప్రతినిధులకు భాగస్వామ్యం లేకపోవడం బాధాకరమని మేధా పాట్కర్ లేఖలో పేర్కొన్నారు. వీటన్నింటినీ చూస్తుంటే, ప్రభుత్వానికి నదీ ప్రభావిత ప్రజల బాగోగుల కంటే, ఉన్నత వర్గాల మెప్పు పొందే అత్యుత్సాహమే కనిపిస్తున్నదని ఆరోపించారు.

పైగా, ఇది ప్రజలకు మేలు చేసే బృహత్తర కార్యక్రమం అంటూనే, ప్రజల ఇళ్లను కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు. అలా ఇప్పటివరకు సర్కార్ 300 ఇళ్లను కూల్చివేసినట్లు గుర్తుచేశారు. బండ్లగూడ జాగీర్ పరిధిలో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం 10.34 ఎకరాల భూమి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ఉవ్విళ్లూరుతున్నదని, ఈ భూదాహం తీరకముందే మరో 43.48 ఎకరాల భూసేకరణ కు నోటిఫికేషన్లు జారీ చేసిందని స్పష్టం చేశారు. ప్రజాస్వామిక విలువలు పట్టించుకోకుండా, ప్రజల సామాజిక భద్రతను పట్టించుకోకుండా సర్కార్ దూకుడుగా ముందుకెళ్లడం సరికాదని పేర్కొన్నారు.

ఎస్‌ఐఏ నుంచి మినహాయింపు?

గతనెల 16న రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జీవో 921పైనా మేధాపాట్కర్ స్పందించా రు. ‘మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్‌ను ‘సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఎస్‌ఐఏ) జాబితా నుంచి మినహాయించారు. జీవో ద్వారా ప్రభుత్వం సుమారు 10,000 నిర్మాణాలు, దాదాపు 3,279 ఎకరాల భూమిని స్వాధీ నం చేసుకోవాలని సంకల్పించింది.

పూర్తి స్థాయి డీపీఆర్ రూపొందించకుండా, విడి భాగాలు విడదీసి డీపీఆర్‌లు సిద్ధం చేయడం సరికాదు. ఏ సర్కారైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేపడుతున్నప్పుడు తప్పకుండా ‘ఎస్‌ఐఏ’ చేపట్టాలి. కానీ.. తెలంగాణ ప్రభుత్వం అలా చేయడం లేదు. సమగ్ర డీపీఆర్ లేకుండా పనులు చేపడితే పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉంది. ప్రజా జీవితాలు అతలాకుతలమయ్యే ప్రమాదం ఉంది’ అంటూ విమర్శించారు.

మద్దతిస్తాం.. ఎప్పుడంటే..

నది పునరుద్ధరణకు తాను పూర్తిగా మద్ద తు ఇస్తానని, కానీ..  ప్రజల ఇళ్ల సంగతేంటని, వారి జీవనోపాధులను ధ్వంసం చేసే పరిస్థితులను ప్రభుత్వం నివారించగలదా? అని మేధా పాట్కర్ ప్రశ్నించారు. ఒకవేళ ప్రజలను నిర్వాసితులను చేయడం అనివార్యమైతే, వారికి జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారనేది ముఖ్యమని పేర్కొన్నారు. ఈవిషయంలో ప్రభుత్వం కచ్చితంగా చట్టాలను అనుసరించాల్సిందేనని నొక్కి చెప్పారు. 2017లో నాటి ప్రభుత్వం ఎల్‌ఏఆర్‌ఆర్ చట్టానికి సవరణలు చేయడం,

తాజాగా ఇప్పటి ప్రభుత్వం దూకుడుగా ఇష్టారీతిన తీసుకుంటున్న నిర్ణయాలు.. ప్రజా పోరాటాల ఫలితంగా యూపీఏ హయాంలో రూపుదిద్దుకున్న చట్టానికి తూట్టు పొడవడమేనని మండిపడ్డారు.  ఒకవర్గానికి మేలు చేసే ప్రాజెక్ట్, మరో వర్గానికి నష్టం చేయకూడదని, ప్రభుత్వం విస్తృతమైన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. తమది ‘ప్రజా పాలన’ అని చెప్పుకొంటున్న  తెలంగాణ ప్రభుత్వం,  ఆ ప్రచారాన్ని వాస్తవిక ఆచరణలో చూపాలని ఆకాంక్షించారు.

 ప్రధానమైన డిమాండ్లు

* ఈనెల 13న (శుక్రవారం) జరుగనున్న కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలి. ప్రాజెక్ట్ మొత్తానికి సంబంధించిన  డీపీఆర్‌ను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రజల ముందు పెట్టాలి. డీపీఆర్‌పై అభ్యంతరాలు సమర్పించేందుకు ప్రజలకు 60 రోజుల పాటు గడువు ఇవ్వాలి. బేషరతుగా ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు స్వీకరించాలి.

* ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారికంగా మూసీ ప్రభావ ప్రాంత ప్రజలు, మూసీ జన ఆందోళన్ ప్రతినిధులతో భేటీ ఏర్పాటు చేయాలి. చర్చలో అందరి వాదనలనూ ప్రభుత్వం వినాలి. 

* నది పరీవాహక ప్రాంత దృష్టికోణంతో ప్రాజెక్ట్‌ను సమగ్రంగా సమీక్షించే ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి. 2013 చట్టం పరిధిలో చోటు చేసుకున్న ఉల్లంఘనలను గుర్తించాలి. ప్రాజెక్ట్ ద్వారా పర్యావరణానికి జరిగే హానిని అంచనా వేయాలి.

* 2017లో నాటి ప్రభుత్వం చేసిన చట్ట సవరణలను ఆధారంగా చేసుకొని, ఈ ప్రభుత్వం జారీ చేసిన అన్ని భూసేకరణ నోటీసులను వెంటనే ఉపసంహరించాలి.

* అసెంబ్లీలో చట్టం ప్రవేశపెట్టి 2017 సవరణలను రద్దు చేసి, 2013 ఎల్‌ఏఆర్‌ఆర్ చట్టాన్ని అసలు రూపంలో పునరుద్ధరించాలి.

మూసీ జన ఆందోళన్