12-02-2026 01:14:01 AM
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్, ప్రజాప్రతినిధులు
ఆదిలాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. మున్సిపల్ పరిధిలోని కొన్ని వార్డుల్లో చెదురు ముదురు ఘటనల మినహా ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయింది. మున్సిపాలిటీలోని 49 వార్డుల్లో పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహజన్ లు దగ్గరుండి పర్యవేక్షించారు. పలు సమస్యాత్మక కేంద్రాలను ఎస్పీ పలుమార్లు సందర్శిస్తూ అక్కడి పరిస్థితి పై ఎప్పటికప్పుడు ఆరా తీశారు.
ఉదయం నుండి సాయంత్రం వరకు పోలింగ్ ప్రక్రియ మందకోడిగానే సాగింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 57.67% పోలింగ్ నమోదయింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పలు కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరగా, మరికొన్ని కేంద్రాల్లో అడపాదడపాగా ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్నిచోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు మరికొన్ని చోట్ల బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు మోడల్ పోలింగ్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు.
ఓటు వేసేందుకు వచ్చే వృద్ధ ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. అటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ శాంతినగర్ కాలనీలోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రేమేంధర్, మాజీ చైర్పర్సన్ రంగనేని మనీషా సైతం తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌లు తమ ఓటు హక్కును వినియోగిం చుకున్నారు.
బుధవారం సాత్నాల క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన వార్డు నంబర్ 38, పోలింగ్ స్టేషన్ నంబర్ 170 వద్ద కలెక్టర్ సామాన్య ఓటరుల్లా వరుసలో నిలబడి ఓటు వేశారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎస్పీ తన ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ని 4వ వార్డ్కు సంబంధించిన ఓటు హక్కును ఇక్కడి నుండి వినియోగించుకున్నారు. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణానికి ఓటు కీలకమని పేర్కొన్నారు .