30 May, 2026 | 12:06 PM

అక్రమ సారాయిపై పోలీసుల ఉక్కుపాదం

30-05-2026 11:03 AM

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) మరిపెడలో నాటు సారా తయారీపై పోలీసులు దాడుల నిర్వహించారు. కార్డన్ అండ్ సెర్చ్‌లో 50 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని, 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు.  మరిపెడ మండలం కోటియా తండా గ్రామపంచాయతీ పరిధిలోని చౌల తండా, జాల్ తండా, అర్లగడ్డ తండాల్లో శనివారం ఉదయం పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్(cordon and search) కార్యక్రమం నిర్వహించారు. అక్రమ సారాయి తయారీ, విక్రయాలు, రవాణా, ఇతర నేర కార్యకలాపాల అరికట్టే లక్ష్యంతో చేపట్టిన ఈ తనిఖీల్లో భారీగా సారా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీల సందర్భంగా 50 లీటర్ల సారా, 4 క్వింటాళ్ల బెల్లం, 50 కిలోల పట్టికను స్వాధీనం చేసుకోగా, సారా తయారీ కోసం సిద్ధం చేసిన 1000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అలాగే పత్రాలు సక్రమంగా లేని 10 ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్ మాట్లాడుతూ, అక్రమ సారాయి తయారీ, విక్రయాలు ప్రజల ఆరోగ్యానికి హానికరం. ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి అక్రమ సారాయి తయారీ సమాచారం అందించాలని సూచించారు.

మరిపెడ ఎస్ఐ గండ్రాతి సతీష్ మాట్లాడుతూ, "మండల పరిధిలో అక్రమ సారాయి నిర్మూలన కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. గ్రామాల్లో తరచూ తనిఖీలు నిర్వహిస్తూ నేర కార్యకలాపాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యం. అక్రమ సారాయి తయారీదారులు, విక్రయదారులపై నిరంతర ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగిస్తాం" అని తెలిపారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్, మరిపెడ ఎస్ఐ గండ్రాతి సతీష్, చిన్నగూడూరు ఎస్ఐ కుశ్ కుమార్‌తో పాటు 25 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అక్రమంగా సారాయి తయారు చేస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.