25 July, 2026 | 2:49 AM

మద్యం సేవించి పట్టుబడ్డ యువకుడికి కోర్టు వినూత్న శిక్ష

25-07-2026 01:59 AM

ఉప్పల్, జూలై 24 (విజయక్రాంతి): బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన ఓ యువకుడికి ఎల్బీ నగర్ కోర్టు వినూత్న శిక్ష విధించింది. శిక్షలో భాగంగా రెండు రోజుల పాటు స్వచ్ఛ భారత్ కమ్యూనిటీ సర్వీస్ నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. పోలీసుల కథనం ప్రకారం, దూల్లపల్లి, జీడిమెట్లకు చెందిన రాహుల్ కుమార్ (26) నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ కనిపించాడు.

దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన ఎల్బీ నగర్ న్యాయమూర్తి ప్రజా ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ, సమాజానికి ఉపయోగపడే విధంగా రెండు రోజుల పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కమ్యూనిటీ సేవలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజా ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని నాచారం ఇన్స్పెక్టర్ ధనంజయ్ గౌడ్  హెచ్చరించారు.