నీట్ ఆందోళనల్లో అసాంఘిక శక్తులు
- విద్యార్థులకు రాళ్లు, కర్రలు ఎలా వచ్చాయి?
- నీట్ అంశానికి, ఆజాద్ కశ్మీర్‌కు సంబంధం ఏమిటి
- ‘నీట్’ లీక్‌పై ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణ చెప్పారు
- 17 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది
- గత, ప్రస్తుత ప్రభుత్వాలదే లీకుల చరిత్ర
- కేంద్ర మంత్రి బండి సంజయ్
* పాకిస్తాన్ నుంచి సోషల్ మీడియా ద్వారా విషప్రచారం చేస్తూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. అందుకే 480 సోషల్ మీడియా ఖాతాలను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది.
హైదరాబాద్, జూలై24 (విజయక్రాంతి): ‘ఢిల్లీలో విద్యార్థుల దీక్షకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. విద్యార్థుల ముసుగులో అసాంఘిక శక్తులు చొరబడ్డాయి. మహిళా జర్నలిస్టు పట్ల కూడా అసభ్యకరంగా ప్రవర్తించారు. విద్యార్థుల దాడిలో 118 మంది పోలీసులు గాయపడ్డారు. పోలీసులు సంయమనంతో వ్యవహరించారు. ఆందోళనకారు లపై లాఠీఛార్జి మాత్రమే చేశారు. దెబ్బలుతిన్నవారిలో చాలా మంది విద్యార్థులు కాదు.
నీట్, ఆర్టికల్ 370, ఆజాద్ కశ్మీర్‌కు సంబంధమేంటి? విద్యార్థుల చేతుల్లోకి రాళ్లు, కర్రలు, ఆయుధాలు ఎలా వచ్చాయి. విద్యార్థులైతే వాటిని పట్టుకోరు’. అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ కాగానే వేగంగా చర్యలు తీసుకున్నామని, 17 మందిని అరెస్టు చేశామన్నారు. విద్యార్థులకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణ చెప్పారని తెలిపారు.
శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు పైడి రాకేశ్ రెడ్డి, పాల్వాయి హరీష్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. నిరసనల సమయంలో పోలీసులు, జర్నలిస్టులు, మహి ళా జర్నలిస్టులపై కొందరు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు.
పాకిస్తాన్ నుంచి సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తూ ఉద్రిక్తతలు సష్టిస్తున్నారని, అందుకే పాకిస్తాన్‌కు చెందిన 480 సోషల్ మీడియా ఖాతాలను కేంద్రం బ్లాక్ చేసిందని తెలిపారు. నీట్‌కు ఆర్టికల్ 370 రద్దుకు, ఆజాద్ కాశ్మీర్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక అంశాలకు సంబంధం ఏమిటని బండి సంజయ్ ప్రశ్నించారు. విపక్షాలు పార్లమెంట్‌లో చర్చలకు ఎందుకు సిద్ధంగా లేవని ప్రశ్నించారు.
వాళ్లెందుకు రాజీనామా చేయలేదు!
రేవంత్‌రెడ్డి రెండున్నరేళ్ల పాలనలోనూ, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలోనూ పరీక్షా పత్రాల లీకేజీలు జరిగాయని, కేసీఆర్, కేటీఆర్, ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ఎందుకు రాజీనామాలు చేయలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ‘జెన్ జీ తరం పిల్లలారా.. బీఆర్‌ఎస్ అంటేనే పేపర్ లీకేజీలు. ప్రశ్నాపత్రాలను అమ్ముకుని దోచుకున్న చరిత్ర ఆ పార్టీది. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది.
ఈ రెండు పార్టీలను నిలదీయండి. అప్పుడైనా వారికి బుద్ధి వస్తుందేమో’ అని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ ఇచ్చే మూటలను కాంగ్రెస్ ఢిల్లీకి మోస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. అందుకే బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన స్కాంలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.






