25 July, 2026 | 2:27 AM

యువతతో గోక్కోవద్దు మోదీజీ! పోరుకు అండ

25-07-2026 01:30 AM
  1. యువతరం కుర్చీ అడగలే.. న్యాయం అడిగింది
  2. ఈ జనరేషన్ సీబీఐ, ఈడీ, ఐటీలకు భయపడదు 
  3. మేకిన్ ఇండియా అడిగితే లీకిన్ ఇండియా ఇచ్చారు
  4. ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలి 
  5. మోదీని ప్రశ్నిస్తే కేడీకి కోపమెందుకో? 
  6. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి) : మోడీజీ మీరు పెట్టుకోకూడని యువతరంతో పెట్టుకున్నారని, ఇప్పటికైనా జాగ్రత్త పడండని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హితవు పలికారు. స్వరం మారుతున్నది, నవతరం మారుతున్నది అని కేంద్రం తెలుసుకోవాలన్నారు. శ్రీలంకలో ఈ యువతరం ప్రభుత్వాలను ఉరికించి పాతరేసిందని, అలాంటి యువతరంతో గోక్కోవద్దని హెచ్చరించారు.

తమ హక్కుల కోసం పోరాడుతున్న యువతరాన్ని తీవ్రవాదులు, దేశద్రోహులు, పాకిస్తానీలు అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, నిజంగానే కేంద్రానికి బాధ్యత ఉంటే విద్యార్థుల వద్దకు వెళ్లి ఇప్పటికే అనేకసార్లు చర్చలు చేసి సమస్యలు పరిష్కరించి ఉండాల్సిందన్నారు. ఇప్పుడు ‘బొద్దింకలు’ ఢిల్లీపై దండయాత్ర చేశారన్నారు. విద్యార్థుల పోరాటానికి బీఆర్‌ఎస్ బాసటగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ఈ జనరేషన్ సీబీఐ, ఈడీ, ఐటీలకు భయపడేది కాదని మోడీ తెలుసుకోవాలని హితవు పలికారు. యువతరానికి ఏ రాజకీయ నాయకుడి అండ లేదని, దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వేలాదిమంది తరలి వస్తున్నారని తెలిపారు. యువతరం ఆందోళన ఆగ్రహం కేవలం పేపర్ లీక్‌కు సంబంధించిందే కాదని, 12 ఏళ్లుగా కేంద్రం చేస్తున్న మోసాలు, ద్రోహాలపైన ఆగ్రహమని స్పష్టం చేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేనందుకే యువతరం బయటకు వచ్చిందన్నారు.

మేకిన్ ఇండియా అడిగితే లీకిన్ ఇండియా బీజేపీ ఇచ్చిందని, విద్యార్థులు యువతరం కేంద్రం నుంచి జవాబుదారీతనాన్ని అడుగుతున్నదని పేర్కొన్నారు. ఢిల్లీలో విద్యార్థులు యువతపై కేంద్రం చేసిన దాష్టీకానికి నిరసనగా విద్యార్థులకు సంఘీభావంగా బీఆర్‌ఎస్‌వీ ఇందిరా పార్కులో చేపట్టిన భారీ నిరసన ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలాదిమంది యువతీ యువకులు తరలివచ్చారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లా డుతూ... అంబేద్కర్ స్ఫూర్తితో పోరాటం చేసి తెలంగాణ సాధించిన ఉద్యమ పార్టీగా విద్యార్థుల ఉద్యమానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీల జెండాలు, ఎజెండాలతో వారి ఉద్యమానికి కలుషితం చేయవద్దని, విద్యార్థులు ఒక్కరే కాదు వారందరికీ మనమంతా అండగా ఉన్నామని చెప్పాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. యువతరం ప్రధానమంత్రి కుర్చీ అడిగిందా? కేంద్రమంత్రి కుర్చీ అడిగిందా?.. కేవలం వారికి న్యాయం చేయమని అడగడంలో తప్పేముందని ప్రశ్నించారు.

నీట్ పరీక్షా పత్రం పేపర్ లీక్‌తో పాటు విద్యారంగంలో సంస్కరణ రావాలని సోనమ్ వాంగ్ చుక్ నిరసనకు కూర్చున్నారని, మీడియా మద్దతు లేకున్నా సోషల్ మీడియాతోనే జెన్ జీ యువతరం దేశం మొత్తాన్ని కదిలించిందన్నారు. విద్యార్థులు కోరుతున్నట్లుగా ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలని, విద్యార్థులపై పెట్టిన పోలీసు కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై చేసిన దాష్టికానికి అక్ర మ కేసుల నమోదుకు క్షమాపణ చెప్పాలన్నారు.

దేశంలో కేంద్ర మంత్రుల కొడుకులు రేపులు చేస్తే వెంటనే బెయిల్ వస్తున్నాయి కానీ పేపర్ లీకుల పైన ఎంత అడిగినా సమాధానం మాత్రం ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. దీనిపై బీజేపీ నాయకులను అడగవలసిన అవసరం ఉన్నది, నిలదీయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పరీక్షా పే చర్చా పెడుతున్న ప్రధాన మంత్రి పరీక్షా పేపర్ లీక్‌పై ఎందుకు చర్చ చేయడం లేదని ప్రశ్నించారు.

విశ్వగురువు అయిన మోడీ ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు. రష్యా ఉక్రైన్ యుద్ధమే ఆపిన మోడీ.. పిల్లల కన్నీళ్లు, వారిపై జరుగుతున్న దాడి ఆపలేరా అని ప్రశ్నించారు. యువత దగ్గర పదునైన అస్త్రాలు ఉన్నాయని, భవిష్యత్ నిర్మాతలు మేల్కొన్నారని హెచ్చరించారు. 

మోడీని అంటే కేడీకి కోపమెందుకు.. 

మోడీ పైన నేను కొట్లాడితే రేవంత్ రెడ్డి అనే కేడీకి ఎందుకు కోపం వచ్చిందరి ఎద్దేవా చేశారు. మోడీని ప్రశ్నిస్తే యూత్ కాంగ్రెస్‌ని నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో కొట్లాడితే నల్లమల్ల పిల్లి పోయి కొడంగల్‌లో దాక్కుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి కూతురునో, మనువడినో ఢిల్లీలో పిల్లల్ని కొట్టినట్లు కొడితే రేవంత్ రెడ్డి ఊరుకుంటారా అని ప్రశ్నించారు.

ఢిల్లీ దాకా వెళ్లి మీ నాయకుడితో కూర్చుండి నిరసించే ధైర్యం కూడా రేవంత్‌రెడ్డికి లేదన్నారు. దేశమంతా నరేంద్ర మోడీని, ధర్మేంద్ర ప్రధాన్‌ని ప్రశ్నిస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్, కేటీఆర్‌ని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీనే వణకించి తెలంగాణ తెచ్చిన పార్టీ మాది.. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి గడగడలాడించి అయినా విద్యార్థుల వెంట నిలబడ తామని స్పష్టం చేశారు. ఢిల్లీని ప్రశ్నించే ధైర్యం లేని రేవంత్ రెడ్డి.. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారో చెప్పాలన్నారు.

యువత అజెండాని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్వతంత్రంగానే మీ అజెండా మేరకు మీ ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. జెన్ జీ ఉద్యమానికి బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ  మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. పార్టీలతో కలిసి మీరు కొట్లాడితే మిమ్మల్ని ఆయా పార్టీల ఏజెంట్లు అని మీ ఉద్యమాన్ని, మీ డిమాండ్లను బలహీనపరిచే ప్రమాదం ఉన్నదన్నారు. ఇద్దరు ఎంపీలతో ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.

విద్యార్థులు, యువతకు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. సమాజంలో జరుగుతున్న ప్రతి కష్టాన్ని, ప్రతివర్గం ఆకాంక్షల్ని కేసీఆర్ ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని, విద్యార్థుల కోసం, యువత కోసం కేసీఆర్ కూడా మీ వెంట నిలుస్తారని వెల్లడించారు. దేశానికి అవసరం పడ్డ రోజు ప్రతి ఒక్కరు స్పందిస్తారు, దేశాన్ని కాపాడుకుంటారు అని గతంలో కేసీఆర్ చెప్పిన విధంగానే  ‘ఇండియా రియాక్ట్’ అవుతుందన్నారు.